కస్టడీలో సీఐడీ చిత్రహింసపై సీబీఐ దర్యాప్తు చేయించండి

ఏపీ సీఐడీ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన సంఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు చేయించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.

Published : 02 Feb 2023 04:26 IST

హైకోర్టులో ఎంపీ రఘురామ వ్యాజ్యం

ఈనాడు, అమరావతి: ఏపీ సీఐడీ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేసి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన సంఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు చేయించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.బాధ్యులపై సంబంధిత న్యాయస్థానంలో క్రిమినల్‌ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని అభ్యర్థించారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. బుధవారం ఈ వ్యాజ్యం జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి వద్ద విచారణకు రాగా గురువారానికి వాయిదా పడింది.

‘ముఖ్యమంత్రి బెయిల్‌ రద్దుకు నేను వ్యాజ్యం వేయడంతో నాపై సీఎం కోపం పెంచుకున్నారు. 2021లో  పోలీసులమని చెప్పుకొంటున్న కొందరు మా ఇంట్లోకి వచ్చి బలవంతంగా నన్ను అదుపులోకి తీసుకున్నారు.కస్టడీలో  నేనున్న గదిలోకి ముసుగులున్న ఐదుగురు వచ్చి తాడుతో నా కాళ్లను కట్టేసి కొట్టారు. హైకోర్టు ఆదేశాలతో నాకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వాస్తవాలకు భిన్నంగా మెడికల్‌ బోర్డు నివేదిక ఇచ్చింది. తర్వాత సుప్రీం ఆదేశాలతో సికింద్రాబాద్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాళ్లపై తీవ్ర గాయాలున్నట్లు నివేదిక వచ్చింది. పోలీసు, పరిపాలన విభాగం కూడబలుక్కొని నిజాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించారు. నా ప్రాణానికి హాని తలపెట్టారు’ అని రఘురామ పిటిషన్‌లో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని