కేంద్ర బడ్జెట్‌ బాగుంది..

కేంద్ర బడ్జెట్‌ బాగుందని, రాజకీయాలను పక్కనపెడితే అందరికీ ఉపయోగపడే పద్దు అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పేర్కొన్నారు.

Published : 02 Feb 2023 04:48 IST

మన సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి

ఈనాడు, అమరావతి: కేంద్ర బడ్జెట్‌ బాగుందని, రాజకీయాలను పక్కనపెడితే అందరికీ ఉపయోగపడే పద్దు అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ‘ప్రీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా మనం చేసిన సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. వేతనజీవులకు పన్ను మినహాయింపు రూ.7 లక్షలకు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పినా ఆ మొత్తం రావడం లేదు. ప్రస్తుత సంవత్సరం 31.25 శాతమే ఇచ్చారు. కర్ణాటకలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంపై అధ్యయనం చేయాల్సి ఉంది. తుంగభద్ర నదీ బేసిన్‌ రాష్ట్రంలో ఉంది. బిందుసేద్యమని ప్రకటించారు. దీంతో అదనంగా నీటిని వినియోగించుకుంటారా, ఉన్న నీటినే వాడుకుంటారా అనేది పరిశీలించాలి. పంప్డ్‌ స్టోరేజ్‌ విధానాన్ని అమలు చేయాలని కోరాం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనకు 66 శాతం నిధులు పెంచారు. రొయ్యల మేతపై పన్నును తగ్గించారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు కేటాయించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీల ఏర్పాటుకు కేంద్ర ప్రకటన ఉపయోగపడుతుంది. ఎరువులకు రూ.50 వేల కోట్లు తగ్గించారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్న 30 నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో రాష్ట్రానికి ఒకటి వస్తుంది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, ఏకలవ్య పాఠశాలలు, ఆక్వా, ఐటీడీఏలకు నిధుల కేటాయింపుతో రాష్ట్రానికి మేలు జరుగుతుంది. కొవిడ్‌తో గత రెండేళ్లుగా పెరిగిన ద్రవ్యలోటు.. ఇప్పుడు 6.4 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గడం దేశానికి శుభపరిమాణం. ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించారు. విద్య, రవాణా, రైల్వేలకు పెంచారు’ అని వెల్లడించారు.


నిరాశే మిగిల్చింది

పి.వి.మిథున్‌రెడ్డి, వైకాపా లోక్‌సభా పక్ష నేత

ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి కేంద్ర బడ్జెట్‌ నిరాశే మిగిల్చింది. విభజన చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించి పదేళ్లయినా ఆ హామీల ప్రస్తావన లేదు. పోలవరం నిధులు, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రైల్వే కారిడార్‌, విశాఖ ఉక్కు ప్రస్తావన లేదు. ఆయా అంశాల గురించి బడ్జెట్‌పై చర్చలో ప్రశ్నిస్తాం. నర్సింగ్‌ కళాశాలలు, ఏకలవ్య పాఠశాలలు, ఇతర అంశాల్లో రాష్ట్రానికి గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా యత్నిస్తాం. పోలవరానికి నిధుల ప్రస్తావన లేకపోవడం బాధాకరమైన విషయం. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతాం. బడ్జెట్‌కు మద్దతు ఇస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని