అమరావతికి నిధులు, విభజన హామీలఅమలేది?

కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, విభజన హామీల అమలు సాధనలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు.

Updated : 02 Feb 2023 06:58 IST

31 మంది ఎంపీలుండి బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏం సాధించారు?
వైకాపాపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు, విభజన హామీల అమలు సాధనలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 31 మంది వైకాపా ఎంపీలుండి ఏం సాధించారని నిలదీశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బడ్జెట్‌లో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు, అదనపు నిధులు తేవాల్సింది పోయి.. కేసులు, స్వప్రయోజనాలకు మాత్రమే జగన్‌, ఆయన పార్టీ ఎంపీలు పనిచేస్తున్నారని బుధవారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ‘బడ్జెట్‌ సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా ఉంది. విజన్‌-2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా ఆలోచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఏపీకి ఆశించిన స్థాయిలో కేటాయింపులు లేకపోవడం నిరుత్సాహం కలిగించింది. కర్ణాటకలోని కరవు ప్రాంతాల కోసం బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించారు. కానీ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ప్యాకేజీ ప్రస్తావన మరిచారు. విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్‌. ఇలాంటి కీలక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది’ అని చంద్రబాబు విమర్శించారు.

వ్యవసాయ, మౌలిక రంగాలను నిలబెట్టేలా ప్రణాళికలు

‘వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనకు ఈ బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యమిచ్చారు. బడ్జెట్‌లో పెట్టుబడి వ్యయం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించడం సానుకూలాంశం. వ్యవసాయ రుణాలు, పీఎం ఆవాస్‌ యోజన, ఆక్వా రంగాలకు గణనీయమైన కేటాయింపులు చేశారు. రవాణా రంగంలో వంద ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టడం, రైల్వే శాఖకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయింపులు శుభపరిణామం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.  


ఇది సామాన్యుల బడ్జెట్‌

సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు  

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చింది. బడ్జెట్‌లో వ్యవసాయం, రైల్వేకు పెద్దపీట వేశారు. ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ రంగానికి అధిక నిధులు కేటాయించారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం తథ్యం.


మధ్యతరగతికి ఊరట

నాదెండ్ల మనోహర్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌

కేంద్ర బడ్జెట్‌ మధ్య తరగతికి ఆర్థికపరంగా ఊరటనిస్తుంది. ఆదాయ పన్ను విషయంలో ఇచ్చిన రాయితీలు, శ్లాబుల మార్పులు ఉద్యోగ వర్గాలకు సంతోషాన్ని కలిగిస్తాయి. మహిళలు, వృద్ధుల పొదుపు పథకాలకు ఇచ్చిన రాయితీలు ఆయా వర్గాల్లో పొదుపుపై ఆసక్తిని పెంచుతాయి. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని 11% పెంచడం రైతాంగానికి ఉపయుక్తంగా ఉంటుంది. చిరు ధాన్యాలకు ప్రాధాన్యం పెరిగేలా ప్రత్యేక పథకం తీసుకురావడం మంచి పరిణామం.


దగాకోరు బడ్జెట్‌

గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ అధ్యక్షుడు

ఇది దగాకోరు బడ్జెట్‌. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కేటాయింపు జరగలేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఏపీ పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని