Nara Lokesh - Yuvagalam: దళిత ద్రోహి జగన్‌

ఎస్సీ, ఎస్టీలపైనే ఎట్రాసిటీ కేసులు పెడుతున్న  జగన్‌.. దళితద్రోహి అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు.

Updated : 02 Feb 2023 06:21 IST

-ఎస్సీ మంత్రి నియోజకవర్గంలోనూ వారికి రక్షణ లేదు
పాదయాత్రలో లోకేశ్‌ ధ్వజం

ఈనాడు డిజిటల్‌- చిత్తూరు, న్యూస్‌టుడే- పలమనేరు: ఎస్సీ, ఎస్టీలపైనే ఎట్రాసిటీ కేసులు పెడుతున్న  జగన్‌.. దళితద్రోహి అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతీయడమే కాకుండా దళితులను చంపేసి మృతదేహాలను ఇంటికి పంపుతోందని ఆరోపించారు. దళితుడైన ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వెదురుకుప్పం మండలం మారేపల్లి ఎస్సీ కాలనీలో బుధవారం పర్యటించి వెళ్లగానే ఎస్సీ మహిళ మారెమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటే.. ఈ రాష్ట్రంలో వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దళితులను చంపేయడానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఏమైనా పథకం తీసుకొచ్చారా అని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఆరో రోజు బుధవారం లోకేశ్‌ చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల్లో 13.8 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రైతులు, మహిళలు, వాల్మీకులు, ఎస్సీలతో సమావేశమయ్యారు.   తమ హయాంలో నాలుగు లక్షల మంది ఎస్సీలకు స్వయం ఉపాధి కల్పించామని చెప్పారు.  

ధరలు తగ్గాలన్నా.. దాడులు ఆగాలన్నా చంద్రబాబు రావాల్సిందే

‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒంగోలులో ఒకరు యువతిని హత్యాచారం చేస్తే 12 గంటల్లో పట్టుకోవాలని ప్రకాశం ఎస్పీని ఆదేశించారు. నిందితుడు భయపడి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. జగన్‌ పాలనలో 900 మంది మహిళలపై దాడులు జరిగాయి. అయినా చర్యలేవు. నిత్యావసరాల ధరలు తగ్గాలన్నా.. మహిళలపై దాడులు ఆగాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందే’ అని చెప్పారు. బైరెడ్డిపల్లె మండలం బేలుపల్లెలో భవన నిర్మాణ కార్మికుడు ఫయాజ్‌.. తెదేపా హయాంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.వెయ్యికి దొరికేదని, ఇప్పుడు నాణ్యత లేని ఇసుకను కూడా రూ.3 వేలు- రూ.5 వేలకు అమ్ముతున్నారని చెప్పారు. జగన్‌ పాలనలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అధ్వానంగా మారిందని లోకేశ్‌ అన్నారు. ఇసుక అక్రమ రవాణాతో వైకాపా నాయకులు రూ.వందల కోట్లు దోచుకుంటున్నారన్నారు. అధికారంలోకి రాగానే పాత ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.  ‘నేను బైరెడ్డిపల్లెలో పాదయాత్ర ముగించుకుని రాగానే యువగళం బ్యానర్లు, ఫ్లెక్సీలు చించేశారు. ఇలాంటివి పునరావృతమైతే వైకాపా నాయకులను తరిమికొడతాం’ అని హెచ్చరించారు. సత్యపాల్‌ కమిటీ నివేదిక మేరకు వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని 2017లో అసెంబ్లీలో తీర్మానం చేశామని.. వైకాపాకు పార్లమెంట్‌లో ఇంతమంది ఎంపీలున్నా దీనిపై ఎందుకు పోరాడటం లేదని నిలదీశారు. రామాపురంలో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు లోకేశ్‌ను కలిశారు. బోధనేతర పనులన్నీ చేయిస్తున్నారని, హామీలు నెరవేర్చాలని అడిగినందుకు తమపై కక్ష సాధిస్తున్నారని చెప్పారు. తెదేపా అధికారంలోకి రాగానే ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు.


లోకేశ్‌తో కలిసిన నడిచిన ఎన్నారై విభాగం నాయకులు 

‘యువగళం’ పాదయాత్రలో తెదేపా ఎన్నారై (యూరప్‌) విభాగం నాయకులు జయకుమార్‌ గుంటుపల్లి (లండన్‌), మురళీకృష్ణ రాపర్ల (ఐర్లాండ్‌), దినేశ్‌ (జర్మనీ), షేక్‌ ఇస్మాయిల్‌ (యూకే), అనిల్‌ పొన్నాల (ఇటలీ)లు లోకేశ్‌తో కలిసి నడిచారు. పాదయాత్రతో పార్టీకి పూర్వవైభవం రానుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని