కేంద్ర బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..?

స్వావలంబన భారత నిర్మాణమే మోదీ ప్రభుత్వ సంకల్పం. దీన్ని నెరవేర్చేందుకు దోహదపడేలా సర్వ సమ్మిళిత, దార్శనికతతో బడ్జెట్‌ను రూపొందించారు.

Updated : 02 Feb 2023 06:12 IST

 

 ప్రచార ఆర్భాటమే అంతా..

కేంద్ర బడ్జెట్‌ ‘ప్రకటనలు ఘనం.. కేటాయింపులు శూన్యం’ అన్నట్టుగా ఉంది. భాజపా సర్కారు నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుడి బతుకును దుర్భరం చేస్తోంది. తాజా బడ్జెట్‌ ఇందుకు మరో ఉదాహరణ. దేశంలో భారీగా ఉన్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఊసెత్తలేదు. దళితులు, గిరిజనులు, బీసీల సంక్షేమం పట్టించుకోలేదు. ఉపాధి నిధులు తగ్గించారు.. పేదల గతేంటి? కనీస మద్దతుధర మాటే మరిచారు. బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలింది.. దీనికి పరిష్కారం చూపారా?

మల్లికార్జున్‌ ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు


ఐటీ శ్లాబుల మార్పుతో ఉపయోగం లేదు

ఆదాయపన్ను(ఐటీ) శ్లాబుల్లో తీసుకొచ్చిన మార్పులతో ఎవరికీ ప్రయోజనం లేదు. ఇది ఆశావాద బడ్జెట్‌కాదు. అవకాశవాద, ప్రజా వ్యతిరేక, పేదలను పక్కనపెట్టిన బడ్జెట్‌. ఇది ఓ వర్గం ప్రజలకే ఉపయోగపడుతుంది. నిరుద్యోగ సమస్యను ఇందులో ప్రస్తావించలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. చీకటి బడ్జెట్‌. నాకు అరగంట సమయమిస్తే పేదల కోసం    బడ్జెట్‌ను ఎలా రూపొందించాలో చూపిస్తా.

 మమతా బెనర్జీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి


రూ.1.75 లక్షల కోట్లు కడితే రూ.325 కోట్లు విదిల్చారా?

గతేడాది ఆదాయపు పన్ను రూపంలో దిల్లీ ప్రజలు రూ.1.75 లక్షల కోట్లు చెల్లిస్తే 2023-24 బడ్జెట్‌లో నగరానికి రూ.325 కోట్లు విదిల్చారు. దేశ రాజధానిపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తోంది. జంట సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగాల నుంచి ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. 

 కేజ్రీవాల్‌, దిల్లీ ముఖ్యమంత్రి


హామీలెక్కువ, నెరవేర్చింది తక్కువ

గత బడ్జెట్‌లో కేటాయింపుల కంటే వాస్తవ వ్యయాలు అతి తక్కువగా ఉన్నాయి. తాజా బడ్జెట్‌.. ఎక్కువ హామీలిచ్చి, తక్కువగా నెరవేర్చే ప్రధాని మోదీ ప్రచార వ్యూహమే. 2022-23 బడ్జెట్‌లో వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఉపాధి హామీ, ఎస్సీల సంక్షేమానికి అధిక నిధుల కేటాయింపు చూపారు. ఇప్పుడు వాస్తవం కనిపిస్తోంది.

 జైరాం రమేశ్‌, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి


మెజారిటీ ప్రజల ఆశలు వమ్ము

సామాన్యుల అవసరాలు ఎంతమాత్రం పట్టించుకోని కఠోరమైన బడ్జెట్‌. ప్రభుత్వంపై భరోసా పెట్టుకున్న ప్రజలను మోసం చేశారు. సమాజంలో ఉన్న పేదరికం, నిరుద్యోగం, అసమానతల వంటి పదాల జోలికి కూడా మంత్రి వెళ్లలేదు. ‘పేద’ అనే మాట దయతో రెండుసార్లు ఉచ్చరించారు. ఇతర వాణిజ్య, ఆర్థిక కేంద్రాల నోళ్లు కొట్టి అహ్మదాబాద్‌ను ‘గిఫ్ట్‌ సిటీ’గా మారుస్తున్నారు.   

 పి.చిదంబరం, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి


22 నుంచి ఉద్యమిస్తాం..

అత్యంత ధనికులపై పన్నులు విధించి యువతకు ఉపాధి కల్పించండి. పన్ను విధానం ప్రగతిశీలంగా ఉండాలి. ఇది సంకుచిత, ప్రజా వ్యతిరేక బడ్జెట్‌. కొవిడ్‌ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. ప్రజల కొనుగోలు శక్తి పెరగలేదు. ఉద్యోగాల సృష్టి జరగలేదు. బడ్జెట్‌ వైఫల్యంపై ఫిబ్రవరి 22 నుంచి 28 దాకా ఆందోళనలు చేపడతాం.

 సీతారాం ఏచూరి, ప్రధాన కార్యదర్శి, సీపీఎం


అన్ని వర్గాలనూ ఆదుకునే బడ్జెట్‌

నూట ముప్పై కోట్ల భారతీయుల అభివృద్ధిని, లక్ష్యాలను ప్రతిబింబిస్తూ ‘నవీన భారత’ దృక్పథమున్న బడ్జెట్‌. పేదలు, రైతులు, యువత, మహిళలు.. ఇలా సమాజంలోని అన్ని వర్గాల అంచనాలను నిజం చేస్తుంది. ఆర్థికంగా భారత్‌ను సూపర్‌ పవర్‌ చేసే బడ్జెట్‌ ఇది. 

 యోగి ఆదిత్యనాథ్‌ (భాజపా), ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం


అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు

కొత్త భారతావనిని నిర్మించాలనే దృక్పథంతో అన్ని వర్గాలను స్పృశించిన దార్శనిక బడ్జెట్‌. రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌లు, పర్యాటక ప్రోత్సాహం, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి వంటి ఆశాజనక అంశాలున్నాయి. ఉత్తరాఖండ్‌ ప్రగతిలో ఈ బడ్జెట్‌ కీలకపాత్ర పోషిస్తుంది.

 పుష్కర్‌సింగ్‌ ధామి (భాజపా), ఉత్తరాఖండ్‌ సీఎం


‘సప్తరిషి’తో ఉన్నత శిఖరాలకు

దేశంలోని పేద ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే బడ్జెట్‌. మధ్యతరగతికి కొత్త వరాలు ఇచ్చారు. ‘సప్తరిషి’ పేరిట ప్రతిపాదించిన ఏడు అంశాలు భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళతాయి.

 భూపేంద్ర పటేల్‌ (భాజపా), గుజరాత్‌ సీఎం


వ్యవసాయరంగానికి చేయూత

కేంద్ర ఆర్థికమంత్రి బడ్జెట్‌లో పేర్కొన్న ప్రభుత్వ ఏడు ప్రాథమ్యాలు సమాజంలోని ప్రతి వర్గానికీ మేలు చేస్తాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌, మత్స్య పరిశ్రమ, ఉద్యానవనాల వృద్ధి, కోటిమంది రైతులను ప్రకృతి సాగులోకి తీసుకురావడం వంటి నిర్ణయాలు వ్యవసాయరంగాన్ని బలోపేతం చేస్తాయి.

మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ (భాజపా), హరియాణా సీఎం


మధ్యతరగతికి ఊరట

సమాజంలోని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చిన బడ్జెట్‌. ఆదాయపన్ను రాయితీలు మధ్యతరగతికి వరమే. 

 దేవేంద్ర ఫడణవీస్‌ (భాజపా),మహారాష్ట్ర డిప్యూటీ సీఎం


ఏకలవ్య నియామకాలు విప్లవాత్మకం

ఆదాయపన్ను రాయితీలతో మధ్యతరగతి వర్గాల్లో పొదుపు పెరుగుతుంది. ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల్లో 38 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది నియామక ప్రకటన విప్లవాత్మకం.

 శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ (భాజపా), మధ్యప్రదేశ్‌ సీఎం


రూ.వెయ్యి కోట్లు అడిగితే.. పట్టించుకోలేదు

పంజాబ్‌ డిమాండ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సరిహద్దు రాష్ట్రం కావడంతో బీఎస్‌ఎఫ్‌తోపాటు రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు రూ.వెయ్యి కోట్లు అడిగాం. సరిహద్దు దాటి దేశంలోకి వస్తున్న ఆయుధాలు, మాదక ద్రవ్యాలను అడ్డుకోవాలంటే ఇది తప్పనిసరి. కేంద్రం పూర్తిగా చేతులెత్తేసింది.

 భగవంత్‌ మాన్‌ (ఆప్‌), పంజాబ్‌ ముఖ్యమంత్రి


మమత లేని బడ్జెట్‌

సామాన్యులను పట్టించుకోని క్రూరమైన బడ్జెటు. ఇది నిర్మలాజీ ప్రవేశపెట్టిన ‘నిర్మమ్‌’ (మమత లేని) బడ్జెట్‌. ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలను పట్టించుకోలేదు. కేవలం ఎన్నిలను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌.

భూపేశ్‌ బఘేల్‌ (కాంగ్రెస్‌), ఛత్తీస్‌గఢ్‌ సీఎం


కేరళకు మొండిచెయ్యి చూపారు

దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతల పరిష్కారానికి బడ్జెట్‌లో ఏ ప్రయత్నం లేదు. ఎయిమ్స్‌ ఏర్పాటు కోసం, రైళ్ల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కేరళకు ఎలాంటి ఊరట లేదు.    

పినరయి విజయన్‌ (సీపీఎం), కేరళ సీఎం


రాజస్థాన్‌ డిమాండ్‌ పట్టించుకోలేదు

రాజస్థాన్‌కు పూర్తిగా నిరాశ కలిగించే బడ్జెట్‌. తూర్పు రాజస్థాన్‌ కెనాల్‌ ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగినా పట్టించుకోలేదు. ఉపాధిహామీ పథకానికి నిధులు తగ్గించడం చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదన్న విషయం తెలిసిపోతోంది.  

అశోక్‌ గహ్లోత్‌ (కాంగ్రెస్‌), రాజస్థాన్‌ సీఎం


నిరాశాజనక బడ్జెట్‌

ఏమాత్రం ఆశ లేని నిరాశాజనక బడ్జెట్‌. దశాబ్దకాలం పూర్తి చేసుకొంటున్న భాజపా ప్రభుత్వం ఇన్నాళ్లూ ఇవ్వనిది.. ఇపుడు కొత్తగా ప్రజలకు ఏమిస్తుంది? 

 అఖిలేశ్‌ యాదవ్‌ (సమాజ్‌వాదీ పార్టీ), యూపీ మాజీ సీఎం

*  భాజపా నేతలు పార్టీ కోసం కాకుండా, దేశం కోసం బడ్జెట్‌ తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది.

 మాయావతి (బీఎస్పీ), యూపీ మాజీ సీఎం


‘అచ్ఛే దిన్‌’కు తిలోదకాలు

ఇది ధనికుల బడ్జెట్‌. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేయలేకపోయింది. 2014లో అధికారంలోకి వచ్చేందుకు భాజపా చెప్పిన ‘అచ్ఛే దిన్‌’కు తిలోదకాలు ఇచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రైల్వేలైన్ల విస్తరణకు, జాతీయ రహదారుల అభివృద్ధికి ఎలాంటి కేటాయింపులు లేవు.   

 సుఖ్విందర్‌సింగ్‌ సుఖు (కాంగ్రెస్‌), హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం


రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదేం?

ప్రజల దృష్టిని మళ్లించి పగటి కలలు చూపిస్తున్నారు. గతంలో పూర్తి చేయని హామీల ‘జుమ్లా’ బడ్జెట్‌ ఇది. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు. చేయకపోగా.. కనీసం ప్రజలను క్షమాపణ కూడా కోరలేదు.

 కమలనాథ్‌ (కాంగ్రెస్‌), మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని