Perni Nani: ట్యాపింగ్‌ జరిగితే మాత్రం ఏమవుతుంది?: పేర్ని నాని

‘మనకు తప్పుడు ఆలోచనలు లేవు, అక్రమాలు చేయడం లేదన్నపుడు ఒకవేళ ఫోన్‌ ట్యాపింగ్‌లాంటి వ్యవస్థ ఉండి, మన ఫోన్‌లను ట్యాప్‌ చేసినంత మాత్రాన ఏమవుతుంది?’ అని మాజీమంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.

Updated : 02 Feb 2023 10:36 IST

అమరావతి: ‘మనకు తప్పుడు ఆలోచనలు లేవు, అక్రమాలు చేయడం లేదన్నపుడు ఒకవేళ ఫోన్‌ ట్యాపింగ్‌లాంటి వ్యవస్థ ఉండి, మన ఫోన్‌లను ట్యాప్‌ చేసినంత మాత్రాన ఏమవుతుంది?’ అని మాజీమంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘అసలు ట్యాపింగ్‌లు ఎందుకు జరుగుతాయి.. మోదీ కూడా ఫోన్లు ట్యాపింగ్‌ చేయిస్తున్నారని చాలామంది రాజకీయ నాయకులు అన్నారు.. అందరికీ ఇదో ఊతపదంగా మారింది’ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

‘ముఖ్యమంత్రి, ఆయన తండ్రి, తాత నుంచి అందరికీ సేవ చేశాను.. వారి భక్తుడిని అని చెప్పే వ్యక్తి, ఒకవేళ తన ఫోన్‌ ట్యాప్‌ అయితే మాత్రం ముఖ్యమంత్రిని విడిచి వెళ్లిపోతారా? ఇవన్నీ అవకాశవాదంతో చేస్తున్నవే’ అని కొట్టిపారేశారు. ‘ఫోన్‌ ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను మేము అధికారంలో ఉన్నపుడు కొనలేదు అని చంద్రబాబే చెప్పారు. మేమూ కొనలేదు. అలాంటపుడు ట్యాపింగ్‌ చర్చ ఎందుకు వస్తుంది? ‘‘ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఫోన్‌లో ఎబ్బెట్టుగా మాట్లాడిన ఆడియో ఇంటెలిజెన్స్‌ అధిపతి దృష్టికి వస్తే.. ముఖ్యమంత్రిపై మాట్లాడినట్లుంది కాబట్టే దాన్ని ఆయన చెక్‌ చేసుకోమని శ్రీధర్‌రెడ్డికి పంపి ఉండొచ్చు.. దాన్ని ఫోన్‌ ట్యాపింగ్‌ అంటే ఏమనాలి? ఆ అనుమానమే ఉంటే ముఖ్యమంత్రిని కలిసి చెప్పి ఉండొచ్చు కదా..’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని