అదానీ షేర్లపై విచారణ జరిపించాలి

దేశ ఆర్థిక వ్యవస్థకన్నా ఏ అంశం పెద్దది కాదని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు.

Published : 03 Feb 2023 04:50 IST

భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు డిమాండ్‌
ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహిస్తోందని కేంద్రంపై విమర్శ

ఈనాడు, దిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకన్నా ఏ అంశం పెద్దది కాదని భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు. అదానీ సంస్థల షేర్ల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని  డిమాండ్‌ చేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చ చేపట్టాలంటూ భారాస లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు ఉభయ సభల్లో గురువారం వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. సభలు ప్రారంభమయ్యాక ఈ అంశంపై చర్చకు పట్టుపట్టారు. ఉభయ సభాపతులు వాయిదా తీర్మానాలను తోసిపుచ్చి సభలను వాయిదా వేశారు. అనంతరం భారాస ఎంపీలు విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. 

కేశవరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని (క్రోనీ క్యాపిటలిజం) ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చకు భారాసతో పాటు 9 విపక్ష పార్టీలు ఉభయ సభల్లో ఇచ్చిన నోటీసులను పరిగణనలోకి తీసుకోకపోవడం సరైందికాదన్నారు. ప్రజలు వర్సెస్‌ వ్యాపారం అనేలా పాలన సాగుతోందని మండిపడ్డారు. భారాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి అంశంపై చర్చకు సిద్ధమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. అదానీ విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. ఎల్‌ఐసీ నిధుల్లో నుంచి దాదాపు రూ.35 వేల కోట్లను అదానీ కంపెనీల్లో పెట్టుబడులుగా ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక, అదానీ వ్యవహారంపై అన్ని రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానాలు పెట్టి చర్చించాల్సి ఉందని భారాస లోక్‌సభాపక్ష ఉప నేత కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. దేశంలో ప్రతి గ్రామంలో ఎల్‌ఐసీతో సంబంధం లేని వ్యక్తి లేరని, అటువంటి సంస్థను అదానీ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని మండిపడ్డారు. ఒక గుజరాతీ కోసం మరో గుజరాతీ అవినీతి కార్యక్రమాలు చేపట్టారని, ఆ అవినీతి డబ్బుతో రాష్ట్రాల్లోని విపక్ష పార్టీల ప్రభుత్వాలను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో ఎంపీలు రంజిత్‌రెడ్డి, పి.రాములు, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర, సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు