భారాస నాందేడ్‌ సభకు విస్తృత ఏర్పాట్లు

మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ నెల 5న తలపెట్టిన భారీ బహిరంగసభకు భారాస నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 03 Feb 2023 04:46 IST

మహారాష్ట్రలో పార్టీ విస్తరణకు నేతల యత్నాలు

నిర్మల్‌, న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఈ నెల 5న తలపెట్టిన భారీ బహిరంగసభకు భారాస నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో భారాసలో భారీగా చేరేందుకు సీనియర్‌ రాజకీయ నాయకులు, పలువురు ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లతో పాటు పార్టీ విస్తరణపై దృష్టి సారించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నాందేడ్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ పలువురు నేతలను కలుస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. గురువారం బోకర్‌ తాలూకాలోని రాఠీ సర్పంచి మల్లేష్‌పటేల్‌ సహా దాదాపు వంద మంది భారాసలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు చూసి భారాసలో చేరినట్లు రాఠీ గ్రామ సర్పంచి మల్లేశ్‌ తెలిపారు. అనంతరం బోకర్‌ మండలం రాఠీ, నాంద, మథూడ్‌, తదితర గ్రామాల్లో మంత్రి పర్యటించారు.  నాందేడ్‌ సభకు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాయంత్రం సభా ప్రాంగణానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. భైంసాలో ఉంటున్న నాందేడ్‌ మాజీ ఎంపీ డీబీ పాటిల్‌ (భాజపా)ను ఇంద్రకరణ్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి వెంట ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని