ధరణి సహా ప్రజాసమస్యలపై గళం

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తేందుకు ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, భాజపా, ఎంఐఎంలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి.

Published : 03 Feb 2023 04:46 IST

బడ్జెట్‌ సమావేశాలకు విపక్షాల సమాయత్తం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రజాసమస్యలపై గళమెత్తేందుకు ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, భాజపా, ఎంఐఎంలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, లేవనెత్తాల్సిన సమస్యలపై ఆ పార్టీలు గత రెండు రోజులుగా కసరత్తు చేశాయి.

ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌..

ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను శాసనసభ వేదికగా ప్రస్తావించనున్నట్లు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. తెరాస ఎన్నికల హామీల అమలుకు పట్టుబడతామన్నారు. రాష్ట్ర సాధనకు మూలమైన నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన అన్ని అంశాలను సమావేశాల్లో లేవనెత్తనున్నట్లు తెలిపారు. ఎనిమిదేళ్లలో ఉద్యోగాల భర్తీ, వ్యవసాయానికి విద్యుత్‌ కోత, రుణమాఫీ, పోడు భూముల సమస్యలు, ధరణి ఇబ్బందులు, రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణం, పెట్రోలు, డీజిల్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీలు సహా అన్ని కీలక అంశాలను ప్రస్తావించనున్నట్లు ప్రకటించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

దళితబంధు, ఉద్యోగాల భర్తీపై భాజపా..

వ్యవసాయానికి విద్యుత్‌ కోతలు, ధరణి, ఉద్యోగుల బదిలీలకు సంబంధించి 317 జీవో అమలుతో ఇబ్బందులు సహా అన్ని ప్రజాసమస్యలను సభలో ప్రస్తావించనున్నట్లు భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. ఉద్యోగాల భర్తీలో అవకతవకలను ప్రస్తావిస్తామని, దళితబంధు, సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అమలుతో పాటు పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కోసం ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మైనార్టీల సమస్యల పరిష్కారం, మైనార్టీ విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్‌ ఉపకార వేతనాల బకాయిలు, షాదీ ముబారక్‌కు రూ.150 కోట్ల అదనపు నిధులు, పెండింగ్‌ దరఖాస్తులకు ఆమోదం, ఇమామ్‌లకు గౌరవ వేతనం బకాయిలు, పాత నగరం అభివృద్ధి, మెట్రో విస్తరణ సహా వివిధ అంశాలపై సభలో చర్చకు పట్టుబట్టేందుకు ఎంఐఎం సిద్ధమైంది. వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుకు ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఇప్పటికే లేఖ రాశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని