Yuvagalam: ‘యువగళం’ ప్రచార రథం సీజ్‌.. విడుదల

‘యువగళం’ పాదయాత్ర ప్రచారరథాన్ని పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. వాహనం విడుదల చేసేవరకూ తాను అక్కడినుంచి కదిలేది లేదని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Published : 03 Feb 2023 05:36 IST

షరతులు ఉల్లంఘించారని అమరనాథరెడ్డికి పోలీసుల నోటీసులు
వాహనాన్ని వదిలేవరకూ కదిలేది లేదన్న లోకేశ్‌
స్టూల్‌ కూడా సీజ్‌ చేస్తారా.. అంటూ ఆగ్రహం

ఈనాడు డిజిటల్‌-చిత్తూరు, న్యూస్‌టుడే-పలమనేరు: ‘యువగళం’ పాదయాత్ర ప్రచారరథాన్ని పోలీసులు గురువారం సీజ్‌ చేశారు. వాహనం విడుదల చేసేవరకూ తాను అక్కడినుంచి కదిలేది లేదని లోకేశ్‌ స్పష్టం చేశారు. దాదాపు పావుగంటపాటు ఆయన టమోటా మార్కెట్‌ రోడ్డుపైనే ఉండటం, వెంట కార్యకర్తలు భారీగా ఉండటంతో పోలీసులు ప్రచారరథాన్ని విడుదల చేశారు. అనంతరం మాజీమంత్రి అమరనాథరెడ్డి పేరిట పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి నోటీసులు ఇచ్చారు. పాదయాత్రకు ఇచ్చిన అనుమతులను ఉల్లంఘిస్తూ లోకేశ్‌తో కలిసి గురువారం మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 వరకు వాహనాలు వెళ్లే దారిలేకుండా, ప్రజల రాకపోకలకు అడ్డంకిగా జాతీయరహదారిపై బహిరంగ సభ నిర్వహించారన్నారు. వాహనం ఎక్కి మైకులో ప్రసంగించినందున వాహనం ఎందుకు సీజ్‌ చేయకూడదో, అనుమతులు ఉల్లంఘించినందున చర్యలు ఎందుకు తీసుకోకూడదో 48 గంటల్లో సమాధానం ఇవ్వాలన్నారు. లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. లోకేశ్‌ ప్రసంగం ముగిసిన కాసేపటికి ప్రచారరథాన్ని సీజ్‌ చేయడంతో ఆయనకు వెంటనే నాయకులు ఈ విషయం చెప్పారు. దిశ డీఎస్పీ బాబుప్రసాద్‌ వచ్చి లోకేశ్‌తో మాట్లాడారు. వారిద్దరి సంభాషణ ఇలా..

లోకేశ్‌: వారం రోజులుగా నేను పాదయాత్ర చేస్తున్నా. సవ్యంగా జరుగుతున్న యాత్రకు ఎందుకు ఆటంకాలు కలిగిస్తారు?

డీఎస్పీ: అనుమతులు ఉల్లంఘించినందునే అడ్డుకున్నాం.  

లోకేశ్‌: ప్రజలు ఎక్కడ ఉంటే నేను అక్కడ మాట్లాడుతున్నా. గ్రామాల్లో ప్రజలకు కనిపించాలని స్టూల్‌ ఎక్కి మాట్లాడా. కొన్నిసార్లు చిన్నారుల కోసం గోడ ఎక్కా. ఇక్కడ పాదయాత్రకు వస్తుండగా ప్రజలు వచ్చి మాట్లాడాలని కోరడంతో వారికి కనపడాలనే వాహనం ఎక్కి మాట్లాడా. వాహనం వచ్చేంతవరకూ నేను ఇక్కడే ఉంటా.

డీఎస్పీ: ప్రజలతో మీరు చర్చించడానికే అనుమతులు ఇచ్చాం.

లోకేశ్‌: నేను బహిరంగసభ నిర్వహించలేదు. సభ అంటే ఒక వేదిక, పెద్ద సౌండ్‌తో వాహనం ఉండాలి. అవేవీ అక్కడ లేవు. నేను స్థానిక ప్రజలతో 45 నిమిషాలు మమేకమయ్యాను. స్టూల్‌ ఎక్కి మాట్లాడితే దాన్నీ సీజ్‌ చేస్తారా? నేనెక్కడా చట్టాన్ని ఉల్లంఘించలేదు. ముఖ్యమంత్రి చెప్పినట్లు మీరు వ్యవహరిస్తారా? నేను మాట్లాడితే ప్రభుత్వానికి భయమెందుకు? బైరెడ్డిపల్లెలో మా ఫ్లెక్సీలను చించేసినా సంయమనంతో ఉన్నాం.   ఈ తరుణంలో మాజీమంత్రి అమరనాథరెడ్డి ఎస్పీ రిషాంత్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి పోలీసులపై ఫిర్యాదుచేశారు. అనంతరం నోటీసులు ఇస్తున్నట్లు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. వాటికి సమాధానం ఇస్తామని అమరనాథరెడ్డి చెప్పడంతో పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.


యుద్ధం మొదలైంది.. నెల్లూరు నుంచే జగన్‌ పతనం ప్రారంభం

‘రాష్ట్రంలో యుద్ధం మొదలైంది.. జగన్‌ పతనం నెల్లూరు నుంచే ప్రారంభమైంది..’ అని లోకేశ్‌ అన్నారు. సొంత ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్న ఇదీ ఒక ప్రభుత్వమేనా అని మండిపడ్డారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా గురువారం ఏడో రోజు ఆయన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రామాపురం ఆసుపత్రి నుంచి బంగారుపాళ్యం మండలం మొగిలి వరకు 15.3 కిలోమీటర్ల మేర పర్యటించారు. పలమనేరు పట్టణం క్లాక్‌ టవర్‌ సమీపంలో మాట్లాడారు. తెదేపా హయాంలో ఆర్యవైశ్యులకు ఎమ్మెల్యే టికెట్‌తోపాటు మంత్రి పదవి ఇచ్చామని, రాజ్యసభకూ పంపామని ఆర్యవైశ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో లోకేశ్‌ అన్నారు. జగన్‌ మాత్రం మంత్రివర్గంలో ఉన్న ఒక్కరినీ తీసేశారన్నారు.

లోకేశ్‌ను కలిసిన భాజపా నాయకులు

పలమనేరు నియోజకవర్గం గాంధీనగర్‌ క్రాస్‌వద్ద భాజపా నాయకులు గుత్త నారాయణస్వామి నాయుడు,  బాలకృష్ణ, దీనదయాళ్‌, మరికొందరు లోకేశ్‌ను కలిసి సంఘీభావం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని