ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆడిట్‌కు సిద్ధమా?

రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్ర సంస్థలతో ఆడిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా? అని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు.

Published : 03 Feb 2023 04:46 IST

పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌పై కేంద్ర సంస్థలతో ఆడిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా? అని ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ప్రశ్నించారు. ‘చివరకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపైనా ఈ ప్రభుత్వం నిఘా పెట్టింది. తమ ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యేలే బయట పెడుతున్నారు. ప్రతిపక్ష శాసనసభ్యులు, నేతలపై ప్రభుత్వం నిఘా పెడుతోందంటూ ఇంతకాలం మేము చెబుతున్నది నిజమేనని వెల్లడైంది’ అని గురువారం విడుదల చేసిన వీడియోలో ఆయన పేర్కొన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై మాట్లాడినందుకు గతంలో తనకు భద్రతను తొలగించారని, ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై సీఎం జగన్‌ ఏం సమాధానమిస్తారని ప్రశ్నించారు. ‘ప్రభుత్వరంగంలోని సంస్థలు వాడే పరికరాలనే కాకుండా.. ప్రైవేటు సాప్ట్‌వేర్‌, మాల్‌వేర్‌ను కూడా నిఘాకు ఉపయోగించారు. వారికి సొమ్ము చెల్లించారు’ అని వివరించారు. ‘నిఘా కోసం ఖర్చు పెట్టిన సొమ్ముతోపాటు.. ఎవరెవరిపై ఎన్ని రోజులు నిఘా పెట్టారో కేంద్ర సంస్థలతో ఆడిట్‌కు సిద్ధమా?’ అని ప్రశ్నించారు. హైకోర్టు న్యాయమూర్తుల పైనా నిఘా పెట్టడంతో దానిపై న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలైందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఏ అవసరార్థమైనా.. నిబంధనల ప్రకారం నిఘా పెడితే రాష్ట్ర హోంశాఖకు, న్యాయశాఖకు సమాచారం ఇస్తున్నారా.. అని కేశవ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘సింగిల్‌ కాపీపై సంతకాలు తీసుకుంటున్నారని, తర్వాత ఆ సమాచారాన్ని కాల్చేస్తున్నారని..’ ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు