మతపరంగా అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు

‘వచ్చే ఎన్నికల్లో మతవిభేదాలు సృష్టించి, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ, వైకాపా ఉండగా అలాంటివారి ఆటలు సాగనివ్వం’ అని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Published : 03 Feb 2023 04:45 IST

వైకాపా ఉండగా అలాంటివారి ఆటలు సాగవు
వైకాపా మైనారిటీ సదస్సులో సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘వచ్చే ఎన్నికల్లో మతవిభేదాలు సృష్టించి, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. కానీ, వైకాపా ఉండగా అలాంటివారి ఆటలు సాగనివ్వం’ అని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘అలాంటి శక్తులు ఎన్నికల ముందు క్రియాశీలం అవుతుంటాయి. వాటిని తిప్పికొట్టడం వైకాపాకే సాధ్యమనే విషయం ప్రతి ముస్లిం కుటుంబానికీ తెలియాలి’ అన్నారు. గురువారం తాడేపల్లిలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన మైనారిటీ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘మైనారిటీలకు ఇప్పటివరకూ రూ.10వేల కోట్లను ముఖ్యమంత్రి అందజేశారు. ప్రభుత్వంపై జరిగే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి. మసీదులు, విద్యాసంస్థలు.. ఎక్కడ వీలైతే అక్కడకు వెళ్లి సంక్షేమపథకాల గురించి చెప్పాలి’ అన్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఎమ్మెల్యేలు అబ్దుల్‌ హఫీజ్‌ఖాన్‌, నవాజ్‌బాషా, ఎమ్మెల్సీలు ఎండీ రుహుల్లా, ఇసాక్‌ బాషా, షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌, వక్ఫ్‌బోర్డు ఛైర్‌పర్సన్‌ ఖాదర్‌ బాషా తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ట్యాప్‌ చేస్తే చంద్రబాబుతో కోటంరెడ్డి మాట్లాడుకున్నదీ తెలిసేది కదా

తర్వాత సజ్జల విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ట్యాపింగ్‌ చేయనప్పుడు దాన్ని ఫోన్‌ ట్యాపింగ్‌ అనడంలో అర్థం లేదు. ఫోన్‌ ట్యాపింగ్‌ స్కీం అంతా చంద్రబాబు వ్యూహంలో భాగమే. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ తన దృష్టికొచ్చిన ఆడియోను సమాచారం కోసం శ్రీధర్‌రెడ్డికి ఇచ్చి ఉంటారు. అందులో ట్యాపింగ్‌ ఏముంది? ఏమైనా ఉంటే సీబీఐకో, ఎఫ్‌బీఐకో.. దేనికైనా ఫిర్యాదు చేయవచ్చు. చంద్రబాబే రికార్డు చేయించి బయటకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ట్యాప్‌ చేసేవాళ్లమే అయితే శ్రీధర్‌రెడ్డి చంద్రబాబుతో మాట్లాడుకుని టికెట్‌ ఖరారు చేసుకున్నవీ తెలిసేవి కదా’ అని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు