జగన్‌ తప్పించుకోలేరు

వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తాజా పరిణామాల నేపథ్యంలో అన్ని వేళ్లూ జగన్‌ కుటుంబం వైపే చూపిస్తున్నాయని, ఇక ఆయన తప్పించుకోలేరని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Updated : 03 Feb 2023 08:13 IST

వివేకా కేసులో..  వేళ్లన్నీ ఆయన కుటుంబం వైపే
ట్యాపింగ్‌పై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిందే
తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు

ఈనాడు, అమరావతి: వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. తాజా పరిణామాల నేపథ్యంలో అన్ని వేళ్లూ జగన్‌ కుటుంబం వైపే చూపిస్తున్నాయని, ఇక ఆయన తప్పించుకోలేరని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సొంత కుమార్తెతో కూడా ఫోన్‌లో మాట్లాడలేకపోతున్నామని వైకాపా ఎమ్మెల్యే చెప్పడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలే తమ ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని రోడ్డెక్కిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కచ్చితంగా సమాధానం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్‌ఛార్జిలతో గురువారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమ నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు, ఓటరు పరిశీలన తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో అందరు సీఎంల కంటే ధనికుడైన జగన్‌మోహన్‌రెడ్డి పేదల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో జగన్‌ అడుగడుగునా రాజీ పడుతున్నారని, వైకాపా ఎంపీలు సొంత లాబీయింగ్‌ కోసమే తప్ప రాష్ట్రం కోసం పని చేయడంలేదని విమర్శించారు. జగన్‌ ఏదైనా స్కీమ్‌ (పథకం) పెట్టారంటే అందులో తప్పకుండా ఏదో స్కామ్‌ (కుంభకోణం) ఉంటుందని దుయ్యబట్టారు.

సీమ రైతాంగానికి ద్రోహమే

రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పనులను మూలన పడేసిన ప్రభుత్వం.. కర్ణాటక తలపెట్టిన అప్పర్‌ భద్ర ప్రాజెక్టుపై మౌనం వహిస్తూ రైతాంగానికి తీరని ద్రోహం చేస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు. మూడున్నరేళ్ల వైకాపా ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ప్రతి ప్రాజెక్టును పరిశీలించి.. జరిగిన నష్టంపై ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. ‘వైఎస్‌ జగన్‌కు అధికారమనేది పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ప్రతిపక్షాలను అణచివేసేందుకు జీవో నంబరు 1 తెచ్చారు. రాజకీయ పక్షాలపై ఆంక్షలు, కేసులు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాలు తప్ప.. సీఎంకు రాష్ట్ర భవిష్యత్తే పట్టడం లేదు. విభజన చట్టం ప్రకారం సాధించాల్సిన హక్కుల విషయంలోనూ వైకాపా ప్రభుత్వం విఫలమైంది. చివరి కేంద్ర బడ్జెట్‌లోనూ కేటాయింపులు పొందలేదు’ అని విమర్శించారు. తెదేపా హయాంలో 11 కేంద్ర సంస్థలను రాష్ట్రానికి తెస్తే.. వాటి పురోగతి ఏమిటో కూడా చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఎయిమ్స్‌కు నీటి సౌకర్యం కూడా కల్పించలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని మండిపడ్డారు. పోలవరం, నదుల అనుసంధాన ప్రాజెక్టులు పూర్తయి ఉంటే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరిచ్చే అవకాశం ఉండేదని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని