మాజీ మంత్రి ముత్తంశెట్టికి చుక్కెదురు.. రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశాఖ జిల్లా భీమిలి మండలం కె.నగరపాలేనికి గురువారం సాయంత్రం వెళ్లిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చుక్కెదురైంది.

Updated : 03 Feb 2023 08:08 IST

విశాఖపట్నం (గ్రామీణ భీమిలి), న్యూస్‌టుడే: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విశాఖ జిల్లా భీమిలి మండలం కె.నగరపాలేనికి గురువారం సాయంత్రం వెళ్లిన మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు చుక్కెదురైంది. ఎమ్మెల్యే తమ గ్రామానికి రాకుండా గ్రామ తెదేపా మాజీ అధ్యక్షుడు తొత్తడి సూరిబాబు, మరికొందరు కలిసి రోడ్డుకు అడ్డంగా పాత చెప్పుల దండ కట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. సీఐ కె.లక్ష్మణమూర్తి సిబ్బందితో వెళ్లి దాన్ని తొలగించారు. సూరిబాబును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించేందుకు ప్రయత్నించగా నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు మరుపల్లి రాజేంద్ర, యువకులు అడ్డుకున్నారు. అనంతరం గడప గడపకు కార్యక్రమాన్ని తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరిస్తున్న రాజేంద్రను స్థానిక వైకాపా కార్పొరేటర్‌, ఆ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో తెదేపా నాయకులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణగడంతో ఎమ్మెల్యే తన కార్యక్రమాన్ని కొనసాగించారు.‘తెదేపాకు చెందిన కొందరు దురుద్దేశంతోనే ఇలా చేశారు. ఇక్కడ ఇళ్ల స్థలాల అంశం కోర్టు పరిధిలో ఉంది. వాళ్లు కావాలనే రాద్ధాంతం చేసినా నేను పెద్దగా పట్టించుకోలేదు. చెప్పులు కట్టిన వ్యక్తిని పోలీసులు తీసుకెళ్తుంటే నేనే వద్దని చెప్పా. నేను ఎవరి జోలికీ వెళ్లను. నా జోలికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా.’ అని ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు