ముస్లింలపై పేట్రేగుతున్న వైకాపా నేతలు

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక ముస్లింలకు రక్షణ కరవైందని, వారిపై వైకాపా నాయకులు దాడులకు దిగుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 04 Feb 2023 03:10 IST

జగన్‌ పాలనలో వారికి రక్షణ కరవు
తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక ముస్లింలకు రక్షణ కరవైందని, వారిపై వైకాపా నాయకులు దాడులకు దిగుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధితులకు తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికార పార్టీ నాయకుల కారణంగా నష్టపోయిన బాధితులు... ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడలో వివిధ ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అందులో విపక్ష పార్టీల అధినేతల్ని కలసి సాయం కోరాలని నిర్ణయించారు. దాంతో వారంతా తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం చంద్రబాబుని కలిశారు. మూడున్నరేళ్లలో ముస్లింలపై దాడులు, వేధింపులకు సంబంధించిన 72 తీవ్రస్థాయి ఘటనలు జరిగాయని ముస్లిం మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎం.ఫరూక్‌ షుబ్లీ వివరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ‘మీరు 72 ఘటనలనే ఇక్కడ ప్రస్తావించారు. ఇంకా వెలుగులోకి రాని అరాచకాలు కొన్ని వందలు జరిగాయి. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో మెజారిటీ ఉన్నప్పటికీ ఓ ముస్లిం మహిళకు ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా చేసి, ఆమెను ఎంపీపీ కాకుండా అడ్డుకున్నారు. తెదేపా హయాంలో వక్ఫ్‌ భూముల్ని ఆడిట్‌ చేయించి, పక్కాగా పత్రాలు తయారు చేయించి కాపాడాం. వైకాపా నాయకుల కన్ను పడ్డాక వాటికి రక్షణ లేకుండా పోయింది. అప్పట్లో శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న అహ్మద్‌ షరీఫ్‌నే సభలో అవమానించారు. రాయచోటిలో అంగన్‌వాడీ టీచర్‌గా ఉన్న ముస్లిం మహిళలను తొలగించి, ఆమె స్థానంలో తమవారికి ఉద్యోగం ఇప్పించుకోవడానికి ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాం కుటుంబం బలవన్మరణానికి కారకులయ్యారు. రాజమండ్రి సమీపంలోని ఓ గ్రామంలోని ముస్లిం బాలికపై అత్యాచారానికి పాల్పడిందే కాకుండా, ఆమె తల్లి స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి... బ్లాక్‌మెయిల్‌ చేశారు. తెదేపా అధికారంలోకి వచ్చాక అందరికీ అండగా ఉంటాం’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. సమావేశంలో శాసనమండలి మాజీ ఛైర్మన్‌ అహ్మద్‌ షరీఫ్‌, మాజీ మంత్రి ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, అత్తర్‌ చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పలువురు బాధితులు మాట్లాడారు.

‘నేను నెల్లూరు జిల్లాలో వక్ఫ్‌బోర్డులో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవాడిని. వక్ఫ్‌ భూముల కబ్జాలను బయటపెట్టానని గత ఏడాది డిసెంబరు 12న ఉద్యోగం నుంచి తొలగించారు’ అని మునావర్‌ కన్నీటి పర్యమయ్యారు. ‘నెల్లూరు జిల్లా మర్రిపాడులో సీజేఎఫ్‌ఎస్‌ కింద ప్రభుత్వం ఇచ్చిన ఏడెకరాల భూమిని లాక్కున్నారు. ప్రశ్నించినందుకు నాపైనా, 75 ఏళ్ల నా తండ్రిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. రేషన్‌ కార్డు, పింఛను కూడా తీసేశారు’ అని మహబూబ్‌ బాషా వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని