‘హుజూరాబాద్‌’ ఎందుకు రాలేదు?

ఉభయసభల సమావేశం ప్రారంభానికి ముందు మంత్రి కేటీ రామారావు శాసనసభలోకి వచ్చి సభ్యులను కలిశారు. మజ్లిస్‌ సభ్యులను కలిసిన అనంతరం భాజపా సభ్యులు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావుల వద్దకు వచ్చి మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Updated : 04 Feb 2023 05:57 IST

ఈటలను అడిగిన మంత్రి కేటీఆర్‌
పిలిస్తేనే కదా వచ్చేదన్న రాజేందర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఉభయసభల సమావేశం ప్రారంభానికి ముందు మంత్రి కేటీ రామారావు శాసనసభలోకి వచ్చి సభ్యులను కలిశారు. మజ్లిస్‌ సభ్యులను కలిసిన అనంతరం భాజపా సభ్యులు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావుల వద్దకు వచ్చి మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షించింది. కేటీఆర్‌ ఈటలతో మాట్లాడుతూ, ఇటీవల హుజూరాబాద్‌లో జరిగిన అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనలేదని అడిగారు. ‘మీరు పిలిస్తే కదా వచ్చేది’ అని ఈటల బదులిచ్చారు. ‘మిమ్మల్ని కూడా పిలిచినం కదా! కలెక్టర్‌ మీకు చెప్పలేదా?’ అని మంత్రి అడగ్గా.. ‘నాకు చెప్పలేదు కాబట్టే నేను రాలేదు. ఎమ్మెల్యేగా ఉన్న నన్ను నా నియోజకవర్గంలో జరిగే ఏ అభివృద్ధి కార్యక్రమాలకూ పిలవడం లేదు. ప్రభుత్వ విధానం బాగోలేదు’ అని ఈటల అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి రఘునందన్‌ వస్తున్నారుకదా అని మంత్రి అన్నారు. ‘అధికారులు పిలవందే నేను ఎలా వస్తాను’ అని ఈటల బదులిచ్చారు. ఈ సంభాషణ జరుగుతుండగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వారివద్దకు వచ్చారు. తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవటంలేదని చెప్పారు. కేటీఆర్‌ నవ్వి... ‘మిమ్మల్ని పిలవని వారంటూ ఎవరూ ఉండరు’ అని వ్యాఖ్యానించారు. కాషాయ దుస్తులలో వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్‌తో మాట్లాడుతూ.. ‘ఎందుకో ఈ రంగు నా కళ్లకు గుచ్చుకుంటోంది’ అని సరదాగా అన్నారు. రాజాసింగ్‌ మాట్లాడుతూ, భవిష్యత్తులో మీరు కాషాయరంగు చొక్కా వేసుకోవాల్సి వస్తుందేమో అంటూ చమత్కరించారు. అంతకుముందు ఉపసభాపతి పద్మారావు సైతం ఈటల వద్దకు వచ్చి పలకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని