విజయాన్ని మించిన అద్భుతం ఏముంటుంది!

విజయాన్ని మించిన అద్భుతమేదీ ఉండదని తెలంగాణ ప్రగతి ప్రస్థానం నిరూపించిందని మంత్రి కేటీ రామారావు శుక్రవారం ట్విటర్‌లో తెలిపారు.

Updated : 04 Feb 2023 05:57 IST

2014-23 మధ్య జరిగిన అభివృద్ధిపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
ప్రధాని మోదీ, సంజయ్‌లపై ఘాటు విమర్శలు

ఈనాడు,హైదరాబాద్‌: విజయాన్ని మించిన అద్భుతమేదీ ఉండదని తెలంగాణ ప్రగతి ప్రస్థానం నిరూపించిందని మంత్రి కేటీ రామారావు శుక్రవారం ట్విటర్‌లో తెలిపారు. సమర్థ నాయకత్వంతో దార్శనికత వాస్తవరూపం దాలుస్తుందని అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు. ప్రస్తుతం అది రూ.3.17 లక్షలకు చేరుకుని 155 శాతం వృద్ధి సాధించింది. 2014లో జీఎస్‌డీపీ రూ.5.05 లక్షల కోట్లు. ఇప్పుడు అది 162 శాతం వృద్ధితో రూ.13.27 లక్షల కోట్లకు చేరుకుంది’ అని వెల్లడించారు.

మోదీ మరో బూటకం అమృత కాలం

అమృత కాలం(అమృత్‌ కాల్‌) పేరిట ప్రధాని మోదీ మరో బూటకపు ప్రచారానికి పూనుకున్నారని కేటీఆర్‌ మరో ట్వీట్‌లో ధ్వజమెత్తారు. ‘గతంలో మంచి రోజులు, ప్రగతి(అచ్చేదిన్‌, వికాస్‌) అంటూ నినాదాలు ఇచ్చారు. అవి సాకారం కాకపోయినా, ఇప్పుడు విశ్వగురు అమృతకాలం అంటూ ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు. గతంలో ఆడ్వాణీని మోదీ వాడుకుని పక్కన పెట్టారు. ఇప్పుడు సన్నిహితుడైన అదానీ విషయంలో అలా చేయగలరా?’ అంటూ ప్రశ్నించారు. మరో ట్వీట్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పైనా వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరు పరమానందయ్యను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, కరీంనగర్‌ ఎంపీగా ఉండి దిల్లీలో కేంద్ర బడ్జెట్‌పై అర్థంపర్థం లేకుండా మాట్లాడారని ఆరోపించారు. ఆయన అబద్దాలకు ఇక్కడి పార్టీ నేతలు వంత పాడడం సిగ్గుచేటన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు