సొంత పార్టీ ఛైర్‌ పర్సన్లపైనే అవిశ్వాస ప్రకటనలు

సొంత పార్టీకి చెందిన ఛైర్‌పర్సన్లపై భారాస కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వారితో పాటు వైస్‌ ఛైర్మన్లపైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని జనగామ, సంగారెడ్డి కలెక్టరేట్లలో నోటీసులు అందజేశారు.

Published : 04 Feb 2023 03:55 IST

జనగామ, సంగారెడ్డి పురపాలికల్లో నోటీసులు అందజేసిన భారాస కౌన్సిలర్లు
మద్దతు పలికిన విపక్ష సభ్యులు

జనగామ, సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: సొంత పార్టీకి చెందిన ఛైర్‌పర్సన్లపై భారాస కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వారితో పాటు వైస్‌ ఛైర్మన్లపైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని జనగామ, సంగారెడ్డి కలెక్టరేట్లలో నోటీసులు అందజేశారు. వీరికి ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, భాజపా, ఎంఐఎం కౌన్సిలర్లూ మద్దతు పలికారు. జనగామ పురపాలిక ఛైర్‌పర్సన్‌ పోకల జమున, వైస్‌ ఛైర్మన్‌ మేకల రాంప్రసాద్‌పై భారాస, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాస ప్రకటన చేశారు. 11 మంది భారాస, 8 మంది కాంగ్రెస్‌ కౌన్సిలర్లు శుక్రవారం కలెక్టరేట్‌కు వచ్చి అదనపు కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ను కలిసి అవిశ్వాస ప్రకటన పత్రాలను అందజేశారు. ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్మన్‌లపై వేర్వేరుగా పత్రాలను అందించారు. ఛైర్‌పర్సన్‌ రేసులో ఉన్న భారాస కౌన్సిలర్‌ బండ పద్మ మాట్లాడుతూ.. తాము పార్టీకి, ఎమ్మెల్యేకు విధేయులమని, పట్టణాభివృద్ధి కోసమే ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ జి.మల్లేశం, కౌన్సిలర్‌ జక్కుల అనిత మాట్లాడుతూ.. మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అధిష్ఠానం సూచన మేరకు ముందుకు వెళ్తామన్నారు. ఇక్కడ పురపాలికలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో అధ్యక్షురాలు విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు లతపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని కోరుతూ భారాస కౌన్సిలర్లు కలెక్టరేట్‌లోని ఏవో మహిపాల్‌రెడ్డికి శుక్రవారం నోటీసు అందజేశారు. భారాసకు చెందిన 15 మంది, కాంగ్రెస్‌-3, భాజపా-2, ఎంఐఎంకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు దీనిపై సంతకాలు చేశారు. ఇక్కడ 38 వార్డులుండగా ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ సందర్భంగా భారాస కౌన్సిలర్‌ బోయిని విజయలక్ష్మి(తిరుగుబాటు వర్గం) మాట్లాడుతూ.. మూడు సంవత్సరాలుగా అధ్యక్షురాలి భర్త రవిదే పెత్తనమని, కౌన్సిలర్లను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. తాము పార్టీకి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. మంత్రి హరీశ్‌రావు, రాష్ట్ర చేనేత, జౌళి అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ చింతా ప్రభాకర్‌ నాయకత్వంలోనే పని చేస్తామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు