రైతులకు రుణమాఫీ హామీ నెరవేరలేదు

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు సరిగా లేవని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు.

Updated : 04 Feb 2023 04:08 IST

సీఎంకు రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు సరిగా లేవని సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. ‘‘రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్న మీ హామీ నేటికీ అమలుచేయలేదు. గత నాలుగేళ్లలో మాఫీ చేసింది రూ.3,881 కోట్లే. ఇంకా రూ.20,857 కోట్ల మాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. దళిత సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేశారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై ప్రజలను ఊరిస్తూనే ఉన్నారు. సొంత జాగా ఉన్నవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షల సాయం చేస్తామన్న హామీ ఏమైంది?  నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఎప్పుడిస్తారు? పేద విద్యార్థుల కోసం కాంగ్రెస్‌ హయాంలో తెచ్చిన ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకాన్ని అటకెక్కించారు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ కోతలతో రైతులు రోడ్డెక్కుతున్నారు. నష్టాల భర్తీ అంటూ గృహ వినియోగదారులపై ఏసీడీ పేరుతో అదనపు కరెంటు ఛార్జీల భారం మోపుతున్నారు. ప్రజలకు మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇది చివరి ఛాన్స్‌. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగే హక్కు లేదు’’ అని కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖలో తెలిపారు.


పార్టీ పటిష్ఠతకు ఏం చేద్దాం..? మాణిక్‌రావు ఠాక్రే

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: పార్టీ పటిష్ఠత కోసం ఏం చేద్దాం? ఇక్కడి పరిస్థితులు ఉలా ఉన్నాయి? అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే రాష్ట్ర నాయకులను ఆరాతీశారు. 4 రోజుల రాష్ట్ర పర్యటన కోసం శుక్రవారం ఆయన హైదరాబాద్‌ వచ్చారు. గాంధీభవన్‌లో పీసీసీ ప్రధాన కార్యదర్శులు నీలిమ, నగేష్‌ ముదిరాజ్‌, యాదాద్రి-భువనగిరి డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ తదితరులతో వేర్వేరుగా భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన వారి జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులతోనూ ఠాక్రే మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని