వివేకా హత్య కేసులోకి సీఎం జగన్‌ పేరు లాగే కుట్ర

‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులోకి సీఎం జగన్‌, ఆయన కుటుంబం పేరును లాగేందుకు చంద్రబాబు, ఆయన సంబంధీకులు కుట్రచేస్తున్నారు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Updated : 04 Feb 2023 09:46 IST

రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

ఈనాడు, అమరావతి: ‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులోకి సీఎం జగన్‌, ఆయన కుటుంబం పేరును లాగేందుకు చంద్రబాబు, ఆయన సంబంధీకులు కుట్రచేస్తున్నారు’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నవీన్‌, కృష్ణమోహన్‌రెడ్డిల కాల్‌లిస్టులను ఆసరాగా చేసుకుని జగన్‌కు లింకు కలపాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం విలేకరులతో సజ్జల మాట్లాడారు. సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, సహాయకుడు నవీన్‌లను సీబీఐ విచారించడంపై ఆయన స్పందిస్తూ... ‘వివేకానందరెడ్డి మృతి విషయాన్ని తన బావ శివప్రకాష్‌రెడ్డి ఫోన్‌చేసి చెబితేనే అవినాష్‌ అక్కడకు వెళ్లారు. ఆయనే పోలీసులకు, జగన్‌కూ తెలిపారు. జగన్‌ వద్ద ఫోన్‌ లేకపోవడంతోనే ఆయన ఓఎస్డీ కృష్ణమోహన్‌, సహాయకుడు నవీన్‌లకు కాల్‌ చేశారు. ఇందులో సంచలనమేముంది? అవినాష్‌, కృష్ణమోహన్‌ల విచారణ అంశాన్ని పట్టుకుని జగన్‌కు, ఆయన కుటుంబానికి హత్య కేసు లింకును కలపొచ్చనే దుర్బుద్ధితో చంద్రబాబు, తెదేపా చేస్తున్న నీచమైన రాజకీయంలో ఇది చిన్న భాగమే. 2024 ఎన్నికల్లో జగన్‌ వ్యక్తిత్వంపై బురదజల్లి, ప్రజల్లో అనుమానాలకు బీజం వేయడం కుదురుతుందేమోననే ఆశతోనే చంద్రబాబు, భాజపాలో ఉన్న ఆయన స్లీపర్‌సెల్స్‌ చేస్తున్న కుట్రలుగానే వీటిని భావిస్తున్నాం’ అని స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని