వివేకా హత్య కేసులో సీఎం దంపతులను ఏశక్తీ కాపాడలేదు: వర్ల రామయ్య

‘వివేకా హత్య జరిగిన రోజు నవీన్‌, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిల ఫోన్ల ద్వారా భారతీరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలతో పదేపదే మాట్లాడానని ఎంపీ అవినాష్‌రెడ్డి చెప్పాక కూడా సీఎం దంపతులు తమకేమీ తెలియదని బుకాయించడం ముమ్మాటికీ పెద్ద తప్పే.

Updated : 04 Feb 2023 06:26 IST

ఈనాడు, అమరావతి: ‘వివేకా హత్య జరిగిన రోజు నవీన్‌, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిల ఫోన్ల ద్వారా భారతీరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిలతో పదేపదే మాట్లాడానని ఎంపీ అవినాష్‌రెడ్డి చెప్పాక కూడా సీఎం దంపతులు తమకేమీ తెలియదని బుకాయించడం ముమ్మాటికీ పెద్ద తప్పే. వివేకా హత్య కేసు ఉచ్చునుంచి ఏ శక్తీ ముఖ్యమంత్రి దంపతులను కాపాడలేదు..’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వివేకా హత్య కేసులో తెలిసిన నిజాలను జగన్‌ దంపతులు సీబీఐకి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఎవరు హతమార్చారో, ఎలా చేశారో, ఎవరు చేయించారో అన్నీ వారికి తెలుసు. ఇంత తెలిశాక మౌనం వహించడం సరికాదు. హత్య జరిగిన రోజు జగన్‌ దంపతులతో అవినాష్‌రెడ్డి ఫోన్లో ఏం మాట్లాడారన్నదే కేసులో కీలకం. తాను ఎప్పుడు భారతీరెడ్డితో మాట్లాడాలన్నా నవీన్‌కు ఫోన్‌ చేస్తానని, జగన్‌తో మాట్లాడాలనుకుంటే ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి ఫోన్‌ చేస్తానని సీబీఐ విచారణలో ఎంపీ అవినాష్‌ ఇప్పటికే చెప్పారు. హత్య జరిగిన రోజు రాత్రి నవీన్‌, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిలు జగన్‌, ఆయన సతీమణి భారతితో ఉన్నారో, లేదో కానీ.. వారి ఫోన్లు సీఎం దంపతుల వద్దే ఉన్నాయి. నవీన్‌, కృష్ణమోహన్‌రెడ్డిలకు పదేపదే ఫోన్లు చేశానని సీబీఐ విచారణలో ఎంపీ చెప్పాక కూడా అవినాష్‌ తమకు ఫోన్‌ చేయలేదని జగన్‌ దంపతులు చెప్పగలరా?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు