చంద్రబాబు ట్రాప్‌లో కోటంరెడ్డి

నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

Published : 04 Feb 2023 06:30 IST

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపణ

నెల్లూరు (నగరపాలక సంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్రాప్‌లో పడి అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని రికార్డింగ్‌ అని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. శ్రీధర్‌రెడ్డి తెదేపాలోకి వెళ్లేందుకు కారణం వెతికి.. వారికి అస్త్రం ఇచ్చేందుకే అలా మాట్లాడారన్నారు. ఆయన నిర్ణయం రాజకీయంగా ఆత్మహత్య లాంటిదని అభివర్ణించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ నిజమైతే కోర్టులు, కేంద్రం దృష్టికి తీసుకెళ్లవచ్చని సలహా ఇచ్చారు. ఎన్‌కౌంటర్‌ చేయాల్సిన అవసరం తమకు లేదని, శ్రీధర్‌రెడ్డి భుజంపై గన్‌ పెట్టి కాల్చాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక, మద్యం, బార్ల గురించి నెల్లూరు గ్రామీణంలో ఏం జరిగిందో విచారణ చేద్దామని సవాలు చేశారు. ఎమ్మెల్యేల పనితీరు, పార్టీ బలోపేతానికి సజ్జల రామకృష్ణారెడ్డి అనేక సలహాలు ఇస్తుంటారని, ఆయనను కావాలనే వివాదంలోకి లాగుతున్నారని అన్నారు. తోలుబొమ్మలాటలో కామెడీపాత్ర పోషించేవాడిగా పవన్‌ కల్యాణ్‌ మిగిలిపోక తప్పదని వ్యాఖ్యానించారు.

బెదిరేవారెవరూ లేరు: మేరుగు నాగార్జున  

‘ట్యాపింగ్‌ అర్థమేంటో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పాలి. ట్యాపింగ్‌ జరిగి ఉంటే ఆధారాలు చూపించాలి’ అని మంత్రి మేరుగు నాగార్జున డిమాండుచేశారు. ‘చంద్రబాబు, లోకేశ్‌లను కలిసొచ్చాక ఆయన ఇలా బురద జల్లితే నమ్మేవారెవరు? ఆయన బ్లాక్‌మెయిలింగ్‌కు బెదిరేవారెవరూ లేరు’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు