సలహాదారుల పనితీరుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రాజకీయ నిరుద్యోగుల్ని, ‘సాక్షి’ మీడియాలో తొలగించిన వారిని సలహాదారులుగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నియమించారని, వీరంతా సెటిల్మెంట్లు, దందాలతో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సబ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Published : 04 Feb 2023 06:29 IST

సెటిల్మెంట్లు, దందాలతో వారు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారు
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు

ఈనాడు, అమరావతి: రాజకీయ నిరుద్యోగుల్ని, ‘సాక్షి’ మీడియాలో తొలగించిన వారిని సలహాదారులుగా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి నియమించారని, వీరంతా సెటిల్మెంట్లు, దందాలతో ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సబ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సలహాదారుల పనితీరుపై పూర్తి వాస్తవాలతో తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రభుత్వం నియమించిన సలహాదారులు ప్రజాధనం దోపిడీతో ఆగకుండా....ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయాలి, ఎవరి ఆస్తుల్ని సెటిల్మెంట్‌ పేరుతో కొట్టేయాలి, ఇసుక, లిక్కర్‌ మాఫియాల నుంచి కమీషన్లు ఎలా వసూలు చేయాలన్న విషయాలపై తీరికలేకుండా ఉన్నారు. సలహాదారులుగా ఉన్న ప్రభుత్వశాఖలకు ఇన్నేళ్లలో ఒక్కటైనా సలహా ఇచ్చారా? మంత్రులు నిర్వహించే సమీక్షల్లో పాల్గొన్నారా? శాఖల వారీగా తమ దోపిడీని విస్తరిస్తూ జేబులు నింపేసుకోవడంతోపాటు సీఎం ఖజానా నింపే పనిలో సలహాదారులుగా వ్యవహరిస్తున్నారు. వీరితో రాష్ట్రానికి ఏం ఉపయోగమో సీఎం సమాధానం చెప్పాలి. సలహాదారుల తీరుపై న్యాయస్థానమే నివ్వెరపోయింది. ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నిస్తే ..ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ కళ్లు తేలేశారు’ అని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ‘సలహాదారుల నియామకాల్లోనూ జగన్‌ తన కులపిచ్చి చాటుకుంటున్నారు. అజేయకల్లంరెడ్డి, వాసుదేవరెడ్డి, పద్మజారెడ్డి, శ్రీనాధ్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, లోకేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, భరత్‌రెడ్డి, వీరారెడ్డి, ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి, చల్లా సాంబశివారెడ్డి..వీరంతా ఎవరు? వీరందరికీ ప్రభుత్వ పెద్ద సలహాదారులుగా సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి తోడు. ఎవరో పీఠాధిపతి చెప్పారని దేవాదాయశాఖకు ప్రభుత్వం సలహాదారుని నియమించడం తుగ్లక్‌ నిర్ణయమే. అగ్రకుల అహంకారంతో సలహాదారులు ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాల మంత్రులపై పెత్తనం చేస్తున్నా...సీఎం ఎందుకు నోరెత్తడం లేదు’ అని బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని