6న మేడారంలో ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ ప్రారంభం

రాష్ట్రంలో ఈ నెల 6న ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధి నుంచి ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు.

Updated : 05 Feb 2023 06:08 IST

కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఈ నెల 6న ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధి నుంచి ‘హాథ్‌సే హాథ్‌ జోడో’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. రెండు నెలల పాటు కొనసాగే పాదయాత్ర ద్వారా రాహుల్‌ గాంధీ సందేశంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఛార్జ్‌షీట్‌ల రూపంలో ప్రతి గడపకు చేరవేస్తామన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు మధుయాస్కీగౌడ్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌, మహేశ్వర్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, చిన్నారెడ్డి, బోసురాజు, రోహిత్‌ చౌదరి, మల్లు రవి తదితరులతో ఆయన శనివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. అంతకుముందు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబులు ఠాక్రేను కలిశారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రలా వెళ్తే.. హాథ్‌సే హాథ్‌ జోడో కార్యక్రమం ప్రాధాన్యం తగ్గుతుందని మహేశ్వర్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. దీనిపై ఠాక్రే స్పందిస్తూ.. ఎవరు ఎక్కడి నుంచి పాదయాత్ర చేసినా కార్యక్రమంలో భాగమేనని చెప్పినట్లు సమాచారం. సమావేశం అనంతరం రేవంత్‌రెడ్డి తదితరులతో కలిసి గాంధీభవన్‌లో ఠాక్రే విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హాథ్‌సే హాథ్‌ జోడో మొదటి విడత కార్యక్రమం ఫిబ్రవరి 6న ప్రారంభమై 22 వరకు జరుగుతుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 24, 25, 26 తేదీల్లో జరిగే ఏఐసీసీ ప్లీనరీ దృష్ట్యా మూడు రోజులపాటు విరామం ఉంటుందని, తర్వాత యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. భట్టివిక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాస్కీ సహా ముఖ్య నాయకులు ఎవరి వీలును బట్టి వారు పాదయాత్రలో పాల్గొంటారన్నారు.

ప్రజల్లో విశ్వాసం కల్పించడానికే: రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో మద్దతు ధర లభించక, రుణమాఫీ కాక రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని రేవంత్‌రెడ్డి చెప్పారు. సమ్మక్క-సారలమ్మల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. అక్కడి నుంచే హాథ్‌సే హాథ్‌ జోడోకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేసీఆర్‌ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి అసెంబ్లీలో గవర్నర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌లా వ్యవహరించారని.. విద్యుత్‌, ఆరోగ్యం, మిషన్‌ భగీరథ అంశాల్లో ఆమెతో అబద్ధాలు చెప్పించారని విమర్శించారు. రాహుల్‌ని విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని