భారాస ‘మహా’ ఎజెండా!

దేశమంతటా విస్తరించాలన్న లక్ష్యంతో ఉన్న భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) తెలంగాణేతర ప్రాంతంలో తొలిసభను ఆదివారం మధ్యాహ్నం నిర్వహించనుంది.

Updated : 05 Feb 2023 06:05 IST

నాందేడ్‌లో నేడు బహిరంగ సభ  
పార్టీలో చేరనున్న మరాఠా నాయకులు
పూర్తయిన ఏర్పాట్లు
ఈనాడు - నిజామాబాద్‌, న్యూస్‌టుడే - నిర్మల్‌

దేశమంతటా విస్తరించాలన్న లక్ష్యంతో ఉన్న భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) తెలంగాణేతర ప్రాంతంలో తొలిసభను ఆదివారం మధ్యాహ్నం నిర్వహించనుంది. మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా కేంద్రంలో జరిగే ఈ సభకు పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. రెండు వారాలుగా ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల ప్రజాప్రతినిధులు సభ విజయవంతం కోసం మహారాష్ట్రలో తెలుగు ప్రజలు నివసిస్తున్న గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి గురించి వివరిస్తూ.. సభకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. నాందేడ్‌లోని శ్రీ గురుగోవింద్‌ సింగ్‌ మైదానంలో పెద్దఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని చెన్నూరు నుంచి బోధన్‌ నియోజకవర్గాల ఊళ్లకు.. మహారాష్ట్రలోని 976 కిలోమీటర్ల మేర సరిహద్దు గ్రామాలున్నాయి. ఇరుప్రాంతాల ప్రజలు నిత్యం వ్యాపార, ఉపాధి, బంధుత్వ అవసరాలతో రాకపోకలు సాగిస్తుంటారు. పూర్వం హైదరాబాద్‌ సంస్థానంలో కొనసాగిన ఈ ప్రాంతాలు ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాయి. నాందేడ్‌ జిల్లా కూడా అందులో భాగమే. ఈ క్రమంలోనే సరిహద్దు జిల్లాల్లోని సర్పంచులు గతంలో భారాస ప్రజాప్రతినిధుల ద్వారా కేసీఆర్‌ను కలిశారు. ఆ సమయంలో తమ గ్రామాలను తెలంగాణలో కలపాలంటూ వారు కేసీఆర్‌కు విన్నవించినా.. ఇందుకు పార్లమెంటులో చట్టం చేయాల్సి ఉంటుందని, అది సులభంగా అయ్యేపని కాదంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు భారాసగా రూపుదిద్దుకున్న తరుణంలో తెలంగాణలో కలిసేందుకు ఆసక్తి చూపిన ప్రాంతాలపై పార్టీ అధినేత దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సభ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

నేతల చేరికలపై దృష్టి

తెలుగువారు, మైనార్టీ ప్రజలున్న ప్రాంతాల్లో విస్తృతంగా సమావేశాలు జరిపి.. మాజీ ప్రజాప్రతినిధుల చేరికలకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది.

మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్‌రెడ్డి, షకీల్‌, టీఎస్‌ఐసీసీ ఛైర్మన్‌ బాలమల్లు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్లు ఎ.లలిత, రవీందర్‌సింగ్‌, నిజామాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు తదితర నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి వారం రోజులుగా అక్కడే మకాం వేసి ఇతర నేతలను సమన్వయం చేసుకుంటూ సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులను కలుస్తూ సభను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ జడ్పీ ఛైర్మన్లు, ఇద్దరు మాజీ మున్సిపల్‌ ఛైర్మన్లు, వందమంది వరకు సర్పంచులు, 80 మంది వరకు కౌన్సిలర్లు భారాసలో చేరేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు. సభావేదిక వద్ద మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్ర బడ్జెట్‌ రూ.5 లక్షల కోట్లకు పైగా ఉండటంతో పాటు దేశ ఆర్థిక రాజధానిగా పేర్కొనే ముంబయి మహానగరం ఉన్నా.. ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి కాలేదని ప్రశ్నించారు. తెలంగాణ బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లు కూడా లేకపోయినా.. గత తొమ్మిదేళ్లలో అనేక రంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు.

భారీ కటౌట్లు.. జెండాలు

నాందేడ్‌ సభావేదికతో పాటు ప్రధాన కూడళ్లలో కేసీఆర్‌ చిత్రాలతో భారీ కటౌట్లు ఏర్పాట్లు చేశారు. డివైడర్లు, వంతెనలు, స్తంభాలకు గులాబీ జెండాలు కట్టారు. వాహనాలపై పోస్టర్లు అతికించారు. మరాఠీలోనే ‘పక్ష ప్రవేశ సోహాల్‌’ (పార్టీ చేరికల సభ) అని రాయించారు. ఈ ప్రాంతంతో సంబంధం లేని కొత్త పార్టీ సభకు జరుగుతున్న ఏర్పాట్లపై స్థానిక ప్రజల్లో చర్చ జరుగుతోంది. సభాప్రాంగణం చుట్టూ పోలీసులు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో మహారాష్ట్ర పోలీసులు సభావేదిక వద్దకు చేరుకోగా.. ఉన్నతాధికారులు వచ్చి వారికి సూచనలు చేశారు. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి కార్తికేయ, ఇతర అధికారులు బందోబస్తును పరిశీలించారు. ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ఇంటెలిజెన్స్‌ పోలీసులు కూడా మఫ్టీలో విధులు నిర్వర్తిస్తున్నారు.


కేసీఆర్‌ నాందేడ్‌ పర్యటన ఇలా..

* సీఎం కేసీఆర్‌ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30కు నాందేడ్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.
* అక్కడి నుంచి ఛత్రపతి శివాజీ విగ్రహం వద్దకు చేరుకొని నివాళులర్పిస్తారు.
* తర్వాత చారిత్రక గురుద్వారాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
* 1.30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన   పలువురు నేతలు భారాసలో చేరతారు.
* సభలో దాదాపు గంటసేపు కేసీఆర్‌ ప్రసంగించే అవకాశం ఉంది.  
* 2.30 గంటలకు స్థానిక సిటీ ప్రైడ్‌ హోటల్‌కు చేరుకుంటారు.
* 4 గంటలకు విలేకరుల సమావేశం.  
* 5 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని