నేటి నాందేడ్‌ సభతో మహారాష్ట్రలో సంచలనం

నాందేడ్‌లో ఆదివారం నిర్వహించనున్న భారత్‌ రాష్ట్రసమితి (భారాస) సభతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం మొదలవుతుందని, అనేకమార్పులు చోటుచేసుకుంటాయని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Published : 05 Feb 2023 03:36 IST

ఆ రాష్ట్ర నేతల సమావేశంలో సీఎం కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: నాందేడ్‌లో ఆదివారం నిర్వహించనున్న భారత్‌ రాష్ట్రసమితి (భారాస) సభతో మహారాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం మొదలవుతుందని, అనేకమార్పులు చోటుచేసుకుంటాయని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారని చెప్పారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్‌ల మాజీ ఛైర్మన్లు, సీనియర్‌ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ వంటి ప్రత్యామ్నాయ ప్రగతి కాముక రాజకీయ నాయకత్వం అవసరం ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్తు, ఆసరా పింఛన్లు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశమంతటా విస్తరించాలని కోరారు. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యంగా భారాసను ఏర్పాటు చేశామని సీఎం వారికి తెలిపారు. మహారాష్ట్రలో ప్రగతి కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని, అన్ని జిల్లాలు సమానస్థాయిలో అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. మహారాష్ట్ర నేతలంతా నాందేడ్‌ సభలో పాల్గొనాలని ఆయన ఆహ్వానించారు.

సీఎంతో మరికొన్ని రాష్ట్రాల నేతల భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శనివారం వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులు భేటీ అయ్యారు. భారాసలో చేరేందుకు వారు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌ నేషనల్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు గోపాల్‌ రిషికార్‌ భారతి, మాజీ మంత్రి చబ్బీలాల్‌ రాత్రే, గడ్చిరోలి జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ పసుల సమ్మయ్య పోచమ, రిపబ్లికన్‌ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ శంకర్‌, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌ మాజీ ఎంపీ బోధ్‌సింగ్‌ భగత్‌, మహారాష్ట్రకు చెందిన భండారా మాజీ ఎంపీ కుషాల్‌భోప్చేలు వేర్వేరుగా సీఎంను కలిశారు. ఈ సందర్భంగా వారు భారాస ఏర్పాటును స్వాగతించారు. ఆ పార్టీకి తమ రాష్ట్రాల్లో రోజురోజుకు జనాదరణ పెరుగుతోందని, పార్టీ సిద్ధాంతాలు, తెలంగాణలో కేసీఆర్‌ పాలనపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందని చెప్పారు. తమ రాష్ట్రాల్లో పార్టీ శాఖలను ఏర్పాటు చేయాలని వారు కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు.

ఒడిశా భారాస నేత మృతికి సీఎం సంతాపం

ఒడిశాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఇటీవల భారాసలో చేరిన అర్జున్‌దాస్‌ శనివారం సొంత రాష్ట్రంలోని జైపుర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన అకాల మరణంపై పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని