Bhuma Akhila Priya: నంద్యాల ఎమ్మెల్యే ఇన్‌సైడర్ ట్రేడింగ్: భూమా అఖిలప్రియ

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి నంద్యాలలో బైపాస్‌ రహదారి వెళ్లే మార్గాన్ని ముందుగానే నిర్ణయించి తన లాభం కోసం 2005-07లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపి కేవలం రూ.5 లక్షలు చెల్లించి 50 ఎకరాలు కొన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు.

Updated : 05 Feb 2023 10:49 IST

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి నంద్యాలలో బైపాస్‌ రహదారి వెళ్లే మార్గాన్ని ముందుగానే నిర్ణయించి తన లాభం కోసం 2005-07లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపి కేవలం రూ.5 లక్షలు చెల్లించి 50 ఎకరాలు కొన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలిపారు. ఆయన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. శుక్రవారం నంద్యాలలో స్థలాన్ని అఖిలప్రియ చూసి ఆళ్లగడ్డకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు శనివారం ఆమెను గృహనిర్బంధం చేశారు. నంద్యాలకు వెళితే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందంటూ సీఐ జీవన్‌బాబు ఆమెకు నోటీసులిచ్చారు. ఆమె నివాసం వద్ద బందోబస్తు ఏర్పాటుచేసి ఎవరూ వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా అఖిలప్రియ విలేకర్లతో మాట్లాడారు. వైద్య కళాశాల ఏర్పాటు పేరుతో ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూములను కేటాయించి తమ భూముల విలువను మరోసారి ఎకరం రూ.10 కోట్లకు ఎమ్మెల్యే పెంచుకున్నారని అన్నారు. తన భూములను కమర్షియల్‌ జోన్‌లో ఉంచి సమీపంలోనివి మాత్రం రెసిడెన్షియల్‌, రిక్రియేషన్‌ జోన్లలో ఉంచారని తెలిపారు. నంద్యాల చుట్టుపక్కల 18 గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములున్న ప్రాంతాన్ని ఇండస్ట్రియల్‌ జోన్‌గా మార్చేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారని వివరించారు. చాబోలుకుంట తవ్వి చెరువు చేస్తామంటూ బైపాస్‌ వద్ద ఎస్సీలకు చెందిన ఏడెకరాలను తమ మిత్రుడైన ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పేరుపై రాయించిన ఘనత శిల్పా కుటుంబానిదని పేర్కొన్నారు. శిల్పా సహకార్‌ పేరిట 20 దుకాణాలకు కలిపి కేవలం రూ.40 వేల బాడుగ చెల్లిస్తున్నారని వివరించారు. ఒక మైనారిటీ వ్యక్తి టీ దుకాణానికి మాత్రం నెలకు రూ.22 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని