నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తే... మీకు వీడియో కాల్స్‌ వస్తాయ్‌!

‘నాకు రోజుకు వంద కాల్స్‌ వస్తే... వాటిలో పది మంది బెదిరించేందుకు చేస్తున్నారు. అయినా భయపడకుండా అంతా వింటున్నా.

Published : 05 Feb 2023 04:38 IST

సజ్జల బెదిరింపులకు భయపడేవాణ్ని కాదు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘నాకు రోజుకు వంద కాల్స్‌ వస్తే... వాటిలో పది మంది బెదిరించేందుకు చేస్తున్నారు. అయినా భయపడకుండా అంతా వింటున్నా. నన్ను, నా తమ్ముడిని కొట్టుకుంటూ తీసుకెళ్తానని ఎవరో కడప నుంచి అనిల్‌ అనే వ్యక్తితో ఫోన్‌ చేయించారు. అతని గురించి ఆరా తీస్తే సజ్జల కోటరీ అని తెలిసింది. ఆయనకు నేను చెప్పేది ఒక్కటే. నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తే.. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుంచి మీకు వీడియో కాల్స్‌ వస్తాయని గుర్తుపెట్టుకో సజ్జల’ అని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం ఉదయం నెల్లూరులోని తన కార్యాలయంలో కోటంరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘వైకాపా నుంచి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో మౌనంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లాలనుకుంటే... అధికారపార్టీకి చెందిన 13 మంది మంత్రులు, సలహాదారులు, ప్రాంతీయ సమన్వయకర్తలు నా వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో స్పందిస్తున్నా’ అని తెలిపారు.

విధేయతపై కాకాణి మాట్లాడుతుంటే జాలేస్తోంది!

‘కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపా వీర విధేయుడు కాదు. వేరే వాళ్లకు విధేయుడని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆయన చెప్పింది వందశాతం నిజం. నేను కష్టాల్లో నడిచిన వ్యక్తిని. ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడిగా ఉంటానే తప్ప, పక్కదారులు చూసే మనిషిని కాదు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మకద్రోహమా.? మరి మిమ్మల్ని జడ్పీ ఛైర్మన్‌ చేసి రాజకీయ మెట్టు ఎక్కించిన ఆనం రామనారాయణరెడ్డితో ఎందుకు విభేదించారు. వై.ఎస్‌. కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది. పాదయాత్రలో భాగంగా జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరుకు వస్తుంటే... నేను, భూమన కరుణాకర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఎన్నిసార్లు నిన్ను కలిశామో గుర్తులేదా.. ఓదార్పు యాత్ర సమయంలో పొదలకూరులో వైఎస్‌ విగ్రహం పెట్టకుండా ఎందుకు అడ్డుకున్నారు కాకాణి? విధేయత గురించి మీరు మాట్లాడుతుంటే నాకు చాలా జాలేస్తోంది. వైకాపాలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది నువ్వు కాదా?’ అని గోవర్ధన్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు.

కాకాణి.. సీబీఐ కేసు సంగతి చూసుకో!

‘మంత్రి పదవి ఇచ్చిన జగన్‌ కంటే... దాన్ని ఇప్పించిన ప్రభుత్వ సలహాదారుడిని అంటే కాకాణి ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే మీడియా సమావేశం పెట్టారు. ముందు నకిలీ పత్రాల కేసు సంగతి చూసుకో. నెల్లూరు కోర్టులో వేలాది ఫైళ్లుంటే... కాకాణి నిందితుడిగా ఉన్న ఫైళ్లు మాత్రమే మాయమయ్యాయి. ఆ పని నువ్వు చేశావని నేను అనలేదు. సీబీఐ అధికారులు నెల్లూరుకు వచ్చిపోతున్నారు జాగ్రత్త’ అని కోటంరెడ్డి హితవు పలికారు.

హత్యాయత్నం కేసు పెట్టుకోండి

‘నా వెంటున్న చాలామంది కార్పొరేటర్లు వెళ్లిపోతున్నారు. వాళ్ల అవసరాలు, ఇబ్బందులు చెబుతున్నారు. ఎన్నికల ముందు వస్తామంటున్నారు. 90% కార్యకర్తలు నాతో ఉంటారు. కార్పొరేటర్‌ విజయ భాస్కర్‌ను నేను బెదిరించానని, అపహరించబోయానని కేసు పెట్టించారు. అపహరణ కాదు.. హత్యాయత్నం కేసు పెట్టుకోండి. ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, విజయ్‌, రఘురామకృష్ణరాజులను ఎలా ఇబ్బంది పెడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. సజ్జల స్థాయికి ఆంధ్ర రాష్ట్రం చాలదు. చాలా దేశాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటికి సలహాదారుడిగా ఉంటే బాగుంటుంది’ అని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు.


శ్రీధర్‌ అన్నతోనే ఉంటాం: నెల్లూరు మేయర్‌

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోనే ఉంటామని, ఆయన ఆదేశిస్తే సంతోషంగా తన పదవికి రాజీనామా చేస్తానని నెల్లూరు మేయర్‌ పొట్లూరి స్రవంతి స్పష్టంచేశారు. శనివారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ... ‘మాకు ఎన్నో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాóు. ఎటు ఉంటారో ఆలోచించుకోండని సూచిస్తున్నారు. మేం శ్రీధర్‌ అన్నతోనే ఉంటాం’ అని స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని