Nara Lokesh: నియోజకవర్గాలన్నింటికీ కలిపి.. ఒకేసారి 175 కేసులు పెట్టండి

‘యువగళం పేరిట ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నేను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ తిరుగుతా. ఒక్కోచోట ఒక కేసు కాదు.. 175 నియోజకవర్గాలకూ కలిపి ఒకేసారి 175 కేసులు పెట్టు జగన్‌’ అంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విరుచుకుపడ్డారు.

Updated : 05 Feb 2023 04:58 IST

సీఎం జగన్‌కు నారా లోకేశ్‌ సవాలు

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: ‘యువగళం పేరిట ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నేను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలూ తిరుగుతా. ఒక్కోచోట ఒక కేసు కాదు.. 175 నియోజకవర్గాలకూ కలిపి ఒకేసారి 175 కేసులు పెట్టు జగన్‌’ అంటూ తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విరుచుకుపడ్డారు. తన పాదయాత్రలో మూడు వాహనాలు, వాటితో పాటు స్టూలునూ సీజ్‌ చేశారని, ఇలాంటి పనులు సరికాదని హితవు పలికారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల్లో తొమ్మిదోరోజు శనివారం పాదయాత్ర చేసి.. బీసీలు, ఎస్సీలు, మహిళలు, రైతులతో ముచ్చటించారు. తన స్వగ్రామమైన తవణంపల్లె మండలం దిగువమాఘంలో మాజీమంత్రి గల్లా అరుణకుమారి.. లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. అరుణకుమారి తండ్రి రాజగోపాలనాయుడు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శనివారం ఉదయం వజ్రాలపల్లిలో లోకేశ్‌ బసచేసిన ప్రాంతానికి పోలీసులు భారీగా తరలివచ్చారు. స్పీకర్లు ఉపయోగించకూడదని ఆదేశించారు. తెదేపా శ్రేణులు ఆ సూచనలు పాటించడంతో పాదయాత్ర ప్రశాంతంగా ముందుకు సాగింది. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. వైకాపా అధికారంలోకి వచ్చాక బీసీలకు  ఆదరణ పరికరాలు ఇవ్వకపోవడంతో పాటు గతంలో కట్టిన 10% నగదూ ఇవ్వలేదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధరలు లభించకపోతే కిలోకు రూ.2 అదనంగా ఇచ్చి రైతులను ఆదుకుందన్నారు. అన్నదాతలను ఆదుకోకుంటే భవిష్యత్తులో తినడానికి గింజలు దొరకవని తెలుసుకోవాలన్నారు.

అరాచకాలను నిలదీస్తే వేధింపులా?

‘పలమనేరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేసినప్పుడు రాణెమ్మ అనే మహిళ తనకు ఇంటిపట్టా అందలేదని.. వైకాపా అరాచకాలపై ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడను నిలదీశారు. ఆమెను ఇప్పుడు వాలంటీర్లు, వైకాపా నాయకులు వేధిస్తున్నారు. అవినీతిపరులైన పోలీసులు మినహా ఆ శాఖలో మిగిలినవారంతా ఇబ్బందులు పడుతున్నారు’ అని లోకేశ్‌ అన్నారు.

అత్యాచారం చేసి నెలరోజుల్లో బయటకు వచ్చారు

‘ఏడేళ్ల నా మనవరాలిపై 70 ఏళ్ల వయసున్న ఓ వైకాపా కార్యకర్త అత్యాచారం చేశాడు. కేసు పెడితే పోలీసులు సరిగా స్పందించలేదు. స్థానిక ఎమ్మెల్యే అతణ్ని నెల రోజుల్లో జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు. అధికారంలోకి వచ్చాక మీరే మాకు న్యాయం చేయాలి’ అంటూ ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

లోకేశ్‌పై కేసు నమోదు

బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: బంగారుపాళ్యంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకున్న ఘటనలతో.. లోకేశ్‌పై రెండు కేసులు నమోదు చేసినట్లు బంగారుపాళ్యం సీఐ నరసింహారెడ్డి శనివారం తెలిపారు. నాలుగురోడ్ల కూడలిలో లౌడ్‌స్పీకర్లు పెట్టి లోకేశ్‌ ప్రసంగించారన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి అమర్‌నాథరెడ్డి, పులివర్తి నాని, దీపక్‌రెడ్డిలపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. బంగారుపాళ్యంలో విధుల్లో ఉన్న తనపై తెదేపా నాయకులు జయప్రకాష్‌నాయుడు, కోదండయాదవ్‌, జగదీష్‌, మరికొందరు హత్యాయత్నం చేశారని గంగవరం సీఐ అశోక్‌కుమార్‌ బంగారుపాళ్యం ఠాణాలో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. 


మార్గదర్శకాల మేరకు భద్రత: డీఐజీ రవిప్రకాష్‌

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: లోకేశ్‌ యువగళం పాదయాత్ర, సభలకు సుప్రీంకోర్టు, హైకోర్టు సూచించిన మార్గదర్శకాల మేరకు భద్రత కల్పిస్తున్నామని అనంతపురం రేంజ్‌ డీఐజీ ఎం.రవిప్రకాష్‌ పేర్కొన్నారు. శనివారం తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే వారి దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ఎక్కడా.. ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. పాదయాత్ర సాఫీగా సాగేందుకు వీలుగా ట్రాఫిక్‌ మళ్లింపులు, భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పాదయాత్రపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. అసత్యప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని