జీవో 1 రద్దు చేయకుంటే.. చలో అసెంబ్లీ

రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ సీఎం జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని, జీవో నంబర్‌ 1 తెచ్చి ప్రజాస్వామ్య ఆకాంక్షల వ్యక్తీకరణను అడ్డుకుంటున్నారని వక్తలు విమర్శించారు.

Published : 05 Feb 2023 04:38 IST

మైక్‌ లేకుండానే  జగన్‌ పాదయాత్ర చేశారా?
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో విపక్ష నేతలు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ సీఎం జగన్‌ నియంత పాలన సాగిస్తున్నారని, జీవో నంబర్‌ 1 తెచ్చి ప్రజాస్వామ్య ఆకాంక్షల వ్యక్తీకరణను అడ్డుకుంటున్నారని వక్తలు విమర్శించారు. శనివారం విజయవాడలో జీవో 1 రద్దు పోరాట కమిటీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు హాజరై పలు తీర్మానాలు చేశారు. ‘జీవో 1 రద్దుకు పోరాటం తీవ్రతరం చేయాలి. 19న విజయవాడలో రాష్ట్ర సదస్సు, చలో అసెంబ్లీపై చర్చించి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలి’ అని ఐక్యవేదిక కన్వీనర్‌ ముప్పాళ్ల సుబ్బారావు తీర్మానం ప్రవేశపెట్టగా, అందరూ ఆమోదించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ‘గన్నవరంలో యూటీఎఫ్‌ దీక్షను జీవో 1 సాకుగా చూపి అడ్డుకోవడం ప్రజలను భయపెట్టడమే. లోకేశ్‌ పాదయాత్రపై ఆంక్షలు సరికాదు. సభలు, మైక్‌ లేకుండానే జగన్‌ పాదయాత్ర చేశారా? కోర్టులున్నాయి కాబట్టే న్యాయం జరుగుతుంది. లేకపోతే జగన్‌ ఎన్ని తిప్పలు పెట్టేవారో’నని వాపోయారు. తెదేపా తరఫున మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ జీవో 1 రద్దుకు ఉద్యమించాలని కోరారు. గతంలో పాదయాత్ర చేసిన జగన్‌.. ఇప్పుడు ప్రతిపక్షాల పాదయాత్రలు, ప్రజాసంఘాల నిరసనలను అడ్డుకోవడమేంటని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ ప్రశ్నించారు. జీవో 1 రద్దు పోరాట కమిటీ ఐక్య వేదిక కన్వీనర్‌, ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు సుంకర రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ జీవో సాకుతో పోలీసులు ప్రైవేటు స్థలాల్లో జరిగే సమావేశాలు, సభలను అడ్డుకుంటున్నారని, దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ జీవో 1 రద్దు కోసం ఇప్పటికే మూడు రూపాల్లో నిరసన తెలిపామని, తదుపరి ‘అసెంబ్లీ ముట్టడి’ నిర్వహించి తీరతామని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్‌ నుంచి నరహరశెట్టి నరసింహారావు, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నేత డి.హరినాథ్‌, అమరావతి జేఏసీ నాయకుడు బాలకోటయ్య, సీఐటీయూ నాయకురాలు డి.రమాదేవి, సీపీఎం నాయకులు అక్కినేని వనజ, వై.వి.వెంకటేశ్వరరావు, ఎ.వి.నాగేశ్వరరావు, కేవీపీఎస్‌ నేత ఆండ్ర మాల్యాద్రి, ప్రజాసంఘాల ప్రతినిధులు మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు