BRS: మార్పు కోసమే భారాస పోరాటం

ఛత్రపతి శివాజీ జన్మస్థలమైన శివనేరి గ్రామంలో శపథం తీసుకొని.. రైతురాజ్య స్థాపనకు మహారాష్ట్ర మొత్తం పర్యటిస్తామని భారాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మహారాష్ట్రలోని 288 శాసనసభా స్థానాల్లోనూ పోటీ చేస్తామని వెల్లడించారు.

Updated : 06 Feb 2023 06:59 IST

రైతులే చట్టాలు చేసే స్థాయికి రావాలి
మహారాష్ట్రలోని అన్ని స్థానాల్లో పోటీ
అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలి
నాందేడ్‌ సభలో కేసీఆర్‌
భారాస వస్తే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ

నాందేడ్‌ నుంచి ఈనాడు ప్రతినిధులు


దేశ జనాభాలో రైతులు, వ్యవసాయ కూలీల కుటుంబాలు 50 శాతానికి పైగా ఉన్నాయి. వీరంతా సంఘటితమై పిడికిలి బిగిస్తే రైతురాజ్యం ఏర్పడటం ఖాయం. 

సీఎం కేసీఆర్‌


త్రపతి శివాజీ జన్మస్థలమైన శివనేరి గ్రామంలో శపథం తీసుకొని.. రైతురాజ్య స్థాపనకు మహారాష్ట్ర మొత్తం పర్యటిస్తామని భారాస అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. మహారాష్ట్రలోని 288 శాసనసభా స్థానాల్లోనూ పోటీ చేస్తామని వెల్లడించారు. ప్రతి మరాఠా గ్రామంలో రైతు కమిటీల ఏర్పాటు ప్రక్రియను పది రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. నాందేడ్‌ జిల్లా కేంద్రంలోని గురుగోవింద్‌ సింగ్‌ మైదానంలో ఆదివారం ‘పక్ష ప్రవేశ సోహల్‌’ (పార్టీ చేరికల సభ) పేరిట భారత్‌ రాష్ట్ర సమితి (భారాస) ఏర్పాటు చేసిన సభలో, అనంతరం విలేకరుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. ‘దేశంలో ఆర్థిక, సహజ వనరులకు కొరతలేదు. దృఢసంకల్పంతో వాటిని ప్రగతి కోసం ఉపయోగించే పాలకులు కావాలి. ప్రజలను విభజించి పాలించే తీరు సమూలంగా మారాలి. ఈ అంశంపై ప్రతి చోటా చర్చ నిర్వహించి మార్పునకు నాంది పలకాలి. యువత, విద్యావంతులు, మేధావులు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది’ అంటూ ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అదానీ కంపెనీల వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేసి విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. భారాస అధికారంలోకి వస్తే చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు.  

ప్రతి ఎకరాకూ నీరివ్వాలా? వద్దా?

‘75 ఏళ్ల స్వతంత్ర భారత్‌లో 54 ఏళ్లు కాంగ్రెస్‌, 16 ఏళ్లు భాజపా, అయిదేళ్లు ఇతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఏటా 1.40 లక్షల టీఎంసీలకు సరిపడా వర్షం కురుస్తోంది. అందులో సగం ఆవిరి కాగా కేవలం 21 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగిస్తున్నాం. మిగతా నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. సాగు, తాగునీటి కష్టాలకు కారణం అదే. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆరువేలకు పైబడి టీఎంసీల నిల్వ సామర్థ్యం గల జలాశయాలను అక్కడి పాలకులు నిర్మించారు. మన దేశంలో అలాంటి ప్రయత్నాలు ఏ ప్రభుత్వాలూ చేయలేదు. భారత్‌లో పెద్ద రిజర్వాయర్ల నిర్మాణం జరపాలా వద్దా, ప్రతి ఎకరాకు సాగునీరివ్వాలా వద్దా?’ అని కేసీఆర్‌ అడగగా.. కావాలంటూ జనం చేతులెత్తి ప్రతిస్పందించారు.

రైతుల ఆందోళనకు ఫలితమేది?

‘దేశంలో రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే అధికమని గణాంకాలు చెబుతున్నాయి.  గోదావరి, కృష్ణ, మంజీర, పెన్‌గంగ, ఇంద్రావతి తదితర నదులు పారుతున్నా.. వ్యవసాయ సంక్షోభం ఎందుకొస్తోందో పాలకులు పట్టించుకోవటం లేదు. వ్యవసాయ చట్టాలపై దిల్లీలో రైతులు 13 నెలలు ఆందోళన చేశారు. 750 మంది చనిపోయారు. ప్రధాని మోదీ చుక్క కన్నీరు కార్చలేదు. జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్న రైతులు ప్రధాని ‘మన్‌కీ బాత్‌’ ఎన్ని రోజులు వినాలి? నాగలి పట్టడం మాత్రమే తెలిసిన రైతులు ఇప్పుడు కలం పట్టి చట్టాలు చేసే స్థాయికి ఎదగాలి. వారు ప్రజాప్రతినిధులు కావాలి.

125 ఏళ్లకు సరిపడా బొగ్గు

అమెరికా కంటే ధనిక రాజ్యంగా, ప్రబల శక్తిగా ఎదిగే అవకాశం భారత్‌కు ఉంది. 361 బిలియన్‌ డాలర్లకు సమానమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. దాంతో 125 ఏళ్ల పాటు వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు ఇవ్వొచ్చు. అయినా రాజనీతి పేరుతో ఎప్పటిదాకా తమాషా చేస్తారు.

ఇచ్చే మనసు లేదు..

తెలంగాణ బడ్జెట్‌ రూ.2.5 లక్షల కోట్లు. మహారాష్ట్ర బడ్జెట్‌ రూ.5 లక్షల కోట్లు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఇక్కడ ఎందుకు లేవు? ఇచ్చే మనసు లేకపోవటమే సమస్య. మహారాష్ట్రలో గులాబీ జెండా ఎగురవేస్తే ఇక్కడా అన్నీ వస్తాయి. భారత్‌ రాష్ట్రసమితిని గెలిపిస్తే.. దేశవ్యాప్తంగా ఏటా 25 లక్షల కుటుంబాలకు దళితబంధును అందిస్తాం. తెలంగాణలో రాయితీపై గొర్రెలు అందిస్తున్నాం. మత్య్సకారులు, గీతకార్మికులు, నాయిబ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు దేశమంతటా అవసరం.

విప్లవాత్మక మార్పు అవసరం

జపాన్‌, దక్షిణ కొరియా, చైనా, మలేసియా వంటి దేశాలు చక్కటి విధానాలతో అనతికాలంలోనే ఆర్థిక పురోభివృద్ధి సాధించాయి. గూడ్సు రైలు, ట్రక్కులు ప్రయాణించే వేగం.. చైనా, అమెరికా, జపాన్‌లతో పోల్చుకుంటే మనమెక్కడున్నాం? మన పాలకులకు చిత్తశుద్ధి లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలో గుణాత్మక మార్పు తీసుకొచ్చేందుకు జాతీయస్థాయిలో పనిచేయాలని నిర్ణయించి భారాసగా విప్లవాత్మక ఎజెండాతో వస్తున్నాం. అవసరమైతే రాజ్యాంగంలో మార్పుల విషయాలను పరిగణనలోకి తీసుకుంటాం. విశ్రాంత న్యాయమూర్తులు, ఐఏఎస్‌లు, ఆర్థికవేత్తలతో విధానాలు రూపొందిస్తున్నాం. రీ ఇన్వెంట్‌ ఇండియా పేరుతో అయిదు విభాగాల్లో సంస్కరణలను భారాస ఎజెండాగా తీసుకున్నాం. ఆర్థిక, రాజ్యాంగపరమైన, ఎన్నికలు, జ్యుడిషియల్‌, అడ్మినిస్ట్రేషన్‌ - గవర్నెన్స్‌లో మార్పులు అవసరం.

ప్రైవేటీకరిస్తే వెనక్కి తీసుకుంటాం

ఎల్‌ఐసీ, విద్యుత్తు, రైల్వే వంటి లాభాలొచ్చే రంగాలనూ ప్రైవేటీకరించాలనుకోవడం చాలా తప్పు. మోదీ ప్రభుత్వం ఇవన్నీ చేసినా మేం 2024లో అధికారంలోకి వచ్చాక తిరిగి తీసుకుంటాం. అవసరం లేకపోయినా కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు అధిక ధరకు ప్రైవేటులో విదేశీ బొగ్గును కొనుగోలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తున్నారు. న్యూయార్కు, లండన్‌లో అయినా విద్యుత్తు అంతరాయం ఉంటుందేమో కానీ హైదరాబాద్‌లో మాత్రం కోతలుండవు. ఇదే పరిస్థితి అన్ని నగరాల్లో ఉండాలి.

అదానీ విషయంలో చిత్తశుద్ధి చాటుకోవాలి

అదానీ కంపెనీల విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో దేశంలో ఆందోళన నెలకొంది. ఈ విషయంలో కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకోవడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీని నియమించి విచారణ చేయించాలి.  కానీ మోదీ తన మిత్రుడిని కాపాడే ఆలోచనలో ఉన్నట్లుగా అనుమానాలు వ్యాపిస్తున్నాయి.

మహనీయులు పుట్టిన గడ్డ

అంబేడ్కర్‌, ఛత్రపతి శివాజీ, సాహెబ్‌రావు, జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే వంటి మహనీయులు జన్మించిన మరాఠా గడ్డ ఇది. ఇంతటి పునీతమైన ప్రాంతంలో మొదటి సభను నిర్వహించాం. మార్పు కోసం పిడికిలి బిగిద్దాం’ అంటూ కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆయన సభా వేదికపై 55 నిమిషాలు గడిపారు. 52 నిమిషాల పాటు హిందీలో ప్రసంగించారు.

భారాసలో చేరికలు

సభలో కేసీఆర్‌ సమక్షంలో పలువురు మరాఠా నాయకులు పార్టీలో చేరారు. కేసీఆర్‌ వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. మహిళా ప్రతినిధులకు ఎమ్మెల్సీ కవిత కండువాలు కప్పారు. అహెరీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దీపక్‌ దాదా ఆత్రంతోపాటు తొమ్మిది మంది మాజీ జడ్పీటీసీ సభ్యులు, సిరోంచ నగర పంచాయతీ అధ్యక్షుడు అబ్దుల్‌ రవూఫ్‌, ముల్చారా నగర పంచాయతీ నుంచి ముగ్గురు ప్రతినిధులు, సిరోంచ తాలూకా నుంచి 12 మంది, అహేరీ తాలూకా నుంచి అయిదుగురు, ఎటపల్లి తాలూకా నుంచి ముగ్గురు సర్పంచులు భారాస తీర్థం పుచ్చుకున్నారు. వివిధ ప్రజా సంఘాలు, తాలూకా, సెక్టార్‌ అధ్యక్షులు సహా వివిధ వర్గాలకు చెందిన నాయకులు చేరారని భారాస వెల్లడించింది.


మరాఠా గడ్డ ‘గులాబీ’మయం

భారాస మహారాష్ట్రలో నిర్వహించిన తొలిసభ సందర్భంగా నాందేడ్‌ గులాబీమయమైంది. సరిహద్దు గ్రామాలు, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. కేసీఆర్‌ మధ్యాహ్నం 2.05 గంటలకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్‌ చేరుకున్నారు. ఆయన వెంట ఎంపీ సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులున్నారు. కేసీఆర్‌ తొలుత స్థానిక గురుద్వారాను సందర్శించుకున్నారు. అనంతరం 3 గంటల సమయంలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వేదికపై ఏర్పాటు చేసిన శివాజీ, అన్నాబావు సాటే, బసవేశ్వర్‌, అంబేడ్కర్‌, జ్యోతిబా ఫులే, సావిత్రీబాయి ఫులే విగ్రహాలకు పూలమాలలు వేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనతో నడిచిన విద్యార్థి నాయకుడు బాల్క సుమన్‌ 29 ఏళ్ల వయసులో లోక్‌సభకు ఎన్నికయ్యారని, ఇప్పుడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆయనను కేసీఆర్‌ సభికులకు పరిచయం చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు, ఉచిత విద్యుత్తు తదితర అంశాలపై డాక్యుమెంటరీ ప్రదర్శించారు. భారాస ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యేలు షకీల్‌, మైనంపల్లి హన్మంతరావు, హన్మంత్‌ శిందే, బాల్కసుమన్‌, జోగురామన్న, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంఘం అధ్యక్షురాలు లలిత, పౌర సరఫరాల సంస్థ అధ్యక్షుడు రవీందర్‌సింగ్‌, నిజామాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు తదితరులు సభలో పాల్గొన్నారు.


పొత్తులపై ఇంకా ఆలోచించలేదు

సభ అనంతరం కేసీఆర్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మహారాష్ట్రలో పొత్తులపై ప్రశ్నలకు స్పందిస్తూ ‘కొత్తగా వస్తున్నాం. ఇంకా ఎలాంటి ఆలోచనలు చేయడంలేదు’ అని బదులిచ్చారు.

మహారాష్ట్రతో తెలంగాణకు ఉన్న నీటి వివాదాలపై స్పందిస్తూ.. ‘బాబ్లీ విషయం కేవలం కొందరు నేతల డ్రామా. అది చిన్న ప్రాజెక్టు. వందల టీఎంసీలు వృథాగా పోతుంటే ఇది పెద్ద విషయం కాదు’ అన్నారు. కాళేశ్వరం విషయంలో మహారాష్ట్రతో గతంలో తాము చర్చించి సమస్యను పరిష్కరించుకున్న విషయాన్ని ప్రస్తావించారు. కూర్చుని మాట్లాడుకుంటే అన్నీ పరిష్కారమవుతాయన్నారు. అవసరమైతే ఎస్పారెస్పీలో ఉన్న నీరు మహారాష్ట్రకు ఇవ్వగలిగే అవకాశముంటుందని గ్రహించాలన్నారు.

మహారాష్ట్రను చిన్న రాష్ట్రాలుగా విభజించాలనే డిమాండ్ల విషయంలో భారాస వైఖరిపై సమాధానమిస్తూ... రాష్ట్రాల విభజన అనేది భౌగోళిక పరిస్థితులు, శాస్త్రీయత, సంప్రదింపులు, ప్రజల ఆకాంక్షలతో ముడిపడి ఉన్న అంశమని బదులిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు