పోలీస్‌శాఖలో బిహార్‌వారికే ప్రాధాన్య పోస్టులు

కేసీఆర్‌ పూర్వీకులది బిహార్‌ రాష్ట్రమంటూ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆంధ్రా నేతలు చేసిన ఆరోపణలు నిజమనిపిస్తున్నాయని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

Updated : 06 Feb 2023 06:17 IST

భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: కేసీఆర్‌ పూర్వీకులది బిహార్‌ రాష్ట్రమంటూ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆంధ్రా నేతలు చేసిన ఆరోపణలు నిజమనిపిస్తున్నాయని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఇటీవల పోలీసుశాఖలో బదిలీ చేసిన 93 మందిలో ఒక్క తెలంగాణ అధికారికీ ప్రాధాన్యం దక్కలేదని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ శాఖలో ప్రాధాన్యమున్న నాలుగు పదవుల్లో బిహార్‌ రాష్ట్రానికి చెందిన ముగ్గుర్ని.. మరో పోస్టులో తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమకారులను హింసించిన అధికారిని నియమించారని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమకు అనుకూలంగా ఉన్నవారిని, ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేసేవారినీ అందలమెక్కించారని విమర్శించారు. తెలంగాణలోని నాలుగు కోట్ల మందీ తమ కుటుంబ సభ్యులేనని మంత్రి కేటీఆర్‌ అంటున్నారని, అదే నిజమైతే శ్రీకాంతచారి కుటుంబంతో పాటు తెలంగాణ కోసం అమరులైన 1,200 కుటుంబాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. అమరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున సాయం ఎందుకు అందించలేదన్నారు. భారాస, మజ్లిస్‌ పార్టీలు ఒక్కటేనని రఘునందన్‌రావు అన్నారు. రానున్న ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి 15 స్థానాల్లో గెలుస్తామని, భారాసకు బీ-టీంగా నిలుస్తామని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ చెప్పడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు