వర్గీకరణపై భాజపా వైఖరికి నిరసన.. 13న రహదారుల దిగ్బంధం: కృష్ణ మాదిగ

వర్గీకరణ విషయంలో భాజపా తీరుకు నిరసనగా.. ఈ నెల 13న రోడ్ల దిగ్బంధనం చేస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు.

Published : 06 Feb 2023 03:27 IST

జగిత్యాల విద్యానగర్‌, న్యూస్‌టుడే: వర్గీకరణ విషయంలో భాజపా తీరుకు నిరసనగా.. ఈ నెల 13న రోడ్ల దిగ్బంధనం చేస్తామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. జగిత్యాలలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ‘మాదిగల ఆవేదన- మాదిగల ఆక్రందన’ పేరిట ఈ నెల 13న ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు హైదరాబాద్‌-విజయవాడల మధ్య 270 కి.మీ మేరకు జాతీయ రహదారుల దిగ్బంధనానికి సిద్ధమయ్యామని చెప్పారు. వర్గీకరణకు 1994 నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న భాజపా.. కేంద్రంలో అధికారంలోకి రాగానే వంద రోజుల్లోనే వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా ఆ బిల్లును పట్టించుకోవడం లేదని విమర్శించారు. హామీలను విస్మరించడంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సైతం ఒకరిని మించి ఒకరు తయారయ్యారని విమర్శించారు. అనాథల అరిగోస పేరిట ఈ నెల 15న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట దీక్షలు చేపట్టనున్నట్లు మంద కృష్ణ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు