ఎమ్మెల్యే మభ్యపెట్టి దోచుకున్నారు

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అందరినీ మభ్యపెట్టి దోచుకున్నారని తిరుపతి జిల్లా వైకాపా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Updated : 06 Feb 2023 06:11 IST

వైకాపా సమన్వయకర్త రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అందరినీ మభ్యపెట్టి దోచుకున్నారని తిరుపతి జిల్లా వైకాపా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలో వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ఆనం తీరు సరిగా లేకపోవడం వల్లే సీఎం జగన్‌ ఆయన్ను పక్కన పెట్టారని, ఇష్టం లేనివారు ఇంట్లో కూర్చోవాలి లేదా అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలన్నారు. ఆనం మాటలకు మోసపోకుండా పార్టీ ఆదేశాలను అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వమే ఎమ్మెల్యేను పక్కన పెట్టాక.. ఆయన చెప్పినట్లు అధికారులు సమావేశాలు నిర్వహించడమేంటని, దీనిపై ఓ ఎంపీడీవోను ప్రశ్నిస్తే సమాధానం లేదని సమావేశంలో ప్రస్తావించారు.

సమావేశాన్ని అడ్డుకోవడంపై ఎంపీపీ ఆగ్రహం

వైకాపాలో వర్గపోరుతో ప్రజల్లో చులకనగా మారే పరిస్థితి ఏర్పడిందని వెంకటగిరి ఎంపీపీ తనూజారెడ్డి ఆవేదన చెందారు. మూడు నెలలకోసారి సర్వసభ్య సమావేశం నిర్వహించడం అనవాయితీ కాగా ఆదివారం నాటి సమావేశానికి సభ్యులు హాజరుకాకుండా నియోజకవర్గ సమన్వయకర్త రామ్‌కుమార్‌రెడ్డి అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ ఎవరికి టికెట్‌ ఇస్తే వాళ్లకే తమ మద్దతు ఉంటుందని, పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. సమన్వయకర్త ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, కనీసం గ్రామాల్లో సమస్యలను తెలుసుకోవడం లేదన్నారు. ఇక్కడి పరిస్థితులపై నేరుగా సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలుస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు