తెలంగాణలో భాజపాకు అధికారం కల్ల: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

భాజపా ఎన్ని ఆటలాడినా తెలంగాణలో అధికారంలోకి రాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

Updated : 06 Feb 2023 06:27 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: భాజపా ఎన్ని ఆటలాడినా తెలంగాణలో అధికారంలోకి రాదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై తీరుపై భాజపా అసంతృప్తితో ఉన్నట్టుందని, ఆమెను ఆ పదవి నుంచి తప్పించినా తప్పించొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాజకీయంగా భారాసను తిట్టి అహో.. అనిపించుకోవాలనే దానికంటే ప్రజల సమస్యలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ జగ్గారెడ్డి మాట్లాడిన విషయాలను.. భారాస సోషల్‌ మీడియాలో ఆ పార్టీకి అనుకూలంగా పోస్టులు పెట్టిన విషయంపై విలేకరులు ప్రస్తావించగా ఆయన ఈ మేరకు స్పందించారు. ‘కేసీఆర్‌ కిట్‌తో మహిళలకు లబ్ధి జరుగుతుంది. కల్యాణలక్ష్మి మంచి పథకమే.. మంచిని మంచి అనాల్సిందే’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

నేడు కాంగ్రెస్‌ నిరసనలు

కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా సోమవారం తెలంగాణలో జిల్లా కేంద్రాల్లోని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ శాఖల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆదివారం తెలిపారు. సామాన్యుల కష్టార్జిత పొదుపు సొమ్ముతో.. తమ స్నేహితులకు, ఎంపిక చేసిన బిలియనీర్లకు లబ్ధి చేకూర్చేలా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో యావత్‌ దేశం, ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని