సంక్షిప్త వార్తలు (5)

పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గిస్తూ 2022 మే నెలలో కేంద్రం నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో మాత్రం ధరలెందుకు తగ్గలేదని తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రశ్నించారు.

Updated : 07 Feb 2023 07:17 IST

పెట్రోల్‌, డీజిల్‌ ధరలను రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదు?

మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గిస్తూ 2022 మే నెలలో కేంద్రం నిర్ణయం తీసుకున్నా రాష్ట్రంలో మాత్రం ధరలెందుకు తగ్గలేదని తెదేపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రశ్నించారు. కేంద్రం తగ్గించినా రాష్ట్రం మాత్రం పన్నులను తగ్గించేది లేదని నాటి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేదని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు తెదేపానే కారణమంటూ జగన్‌ తన సొంత పత్రికలో తప్పుడు కథనాలు రాయిస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జీవో 204ను గమనిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఎవరు పెంచారో అర్థమవుతుంది. రహదారి అభివృద్ధి సెస్‌ పేరుతో ప్రతి లీటరుపై రూపాయి వసూలు చేస్తున్నారు. కానీ రహదారులపై పడ్డ గుంతలు పూడ్చటం లేదు. ఒక్క ఛాన్స్‌ అని అధికారంలోకి వచ్చి బాదుడేబాదుడుతో జనాన్ని ముంచారు’’ అని కూన రవికుమార్‌ ధ్వజమెత్తారు.


కోటంరెడ్డి బాటలో 40 మంది శాసనసభ్యులు

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: కోటంరెడ్డి బాటలో మరో 30 నుంచి 40 మంది శాసనసభ్యులు ఉన్నారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీనియర్‌ శాసనసభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి సూచించగా... నమ్మిన వారిని అనుమానించవద్దని శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కోరారని పేర్కొన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ నుంచి నన్ను బహిష్కరించాలని అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయిస్తే ఆయన ఆదేశాలు శిరసావహిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రుషికొండపై లేని చెట్లను ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తోందన్నారు. అమరావతిలో ఆర్‌బీఐ రీజినల్‌ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారని, అయితే.. దానిని విశాఖలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరడం విడ్డూరంగా ఉందని రఘురామ చెప్పారు.


మీరు ఆ ఒప్పందం చేసుకున్నారేం?: శశిథరూర్‌

దిల్లీ: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ను కీర్తించానని తనపై విరుచుకుపడుతున్న భాజపా నాయకులకు కాంగ్రెస్‌  సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ సోమవారం పలు ప్రశ్నలు సంధించారు. 2003లో ఎన్‌డీయే ప్రభుత్వం ఆయనతో ఎందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుందో, 2004లో సంయుక్త ఒప్పందంపై ఎందుకు సంతకం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరణించినవారి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడే సంప్రదాయం ఉన్న భారతదేశంలో తాను జన్మించానని చెప్పారు. ముషారఫ్‌కు థరూర్‌ ట్విటర్‌లో నివాళులు అర్పిస్తూ ఒకప్పుడు ముషారఫ్‌ భారత్‌కు బద్ధ శత్రువైనా 2002-2007 మధ్య శాంతి కోసం నిజంగా కృషిచేశారన్నారు. దీనిపై భాజపా నేతలు థరూర్‌ పాకిస్థాన్‌ ఆరాధనకు పాల్పడుతున్నారని విమర్శించారు.


త్రిపుర ప్రజలకు భాజపా అధికారం ఇచ్చింది

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

సంతిర్‌బజార్‌/ఖొవాయ్‌: గత ప్రభుత్వాలు త్రిపుర ప్రజలకు అంధకారాన్ని ఇస్తే భాజపా అధికారాన్ని ఇచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రజల అభివృద్ధి కోసం ప్రధాని మోదీపై మరోసారి నమ్మకం ఉంచాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం సోమవారం త్రిపురలో పర్యటించిన అమిత్‌షా పలు సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌, సీపీఐ (ఎమ్‌) కూటమితో కొత్త ప్రాంతీయ పార్టీ తిప్రా మోథా లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. ఇక్కడి మూలవాసులను తప్పుదోవ పట్టించి వామపక్ష పాలనను తీసుకొచ్చేందుకు ఆ పార్టీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. తిప్రా మోథాకి ఓటేస్తే అది కాంగ్రెస్‌కు వేసినట్టు, కాంగ్రెస్‌కు వేసిన ఓటు వామపక్షాలకు వెళ్లినట్టు ఆఖరికి అది చీకటి గతానికి మళ్లీ స్వాగతం పలికినట్లు అని నిప్పులు చెరిగారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల పొత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా ప్రభుత్వం ఇక్కడ శాంతిని తీసుకొచ్చిందని తెలిపారు.


ముగిసిన మాణిక్‌రావ్‌ ఠాక్రే పర్యటన 

గాంధీభవన్, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే నాలుగు రోజుల తెలంగాణ పర్యటన సోమవారం ముగిసింది. చివరిరోజు ఆయన గాంధీభవన్‌లో కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, నేతలు వి.హనుమంతరావు, దామోదర రాజనర్సింహా, ఎమ్‌ఆర్‌జీ వినోద్‌రెడ్డి, పాల్వాయి స్రవంతి తదితరులతో విడివిడిగా భేటీ అయ్యారు. హాథ్‌ సే హాథ్‌ జోడో అభియాన్‌లో పాల్గొనాలని సూచించారు.


ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తా.. గుడివాడ నుంచీ ఆహ్వానం: రేణుకా చౌదరి

వచ్చే ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి ప్రకటించారు. మాణిక్‌రావ్‌ ఠాక్రేతో భేటీ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా. గుడివాడ నుంచి పోటీచేయాలనే ఆహ్వానం ఉంది’ అని తెలిపారు. హాథ్‌సే హాథ్‌ జోడో పాదయాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆహ్వానించి ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని