వైకాపాకు ప్రభుత్వ భూమి ఇవ్వడంపై రగడ

మచిలీపట్నం నగరం నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా ఒడ్డుతామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు.

Published : 07 Feb 2023 04:02 IST

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, నాయకుల అరెస్టు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: మచిలీపట్నం నగరం నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు ప్రాణాలైనా ఒడ్డుతామని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. ప్రజావసరాలకు వినియోగించాల్సిన రెండెకరాల స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ కొల్లు రవీంద్ర, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల జగన్నాథరావు ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపట్టారు. మొదట ర్యాలీకి పోలీసులు అనుమతిచ్చారు. తెదేపా ప్రదర్శన జిల్లా కోర్టు సెంటరు నుంచి వైకాపాకు కేటాయించిన భూమి వద్దకు వెళుతుండగా అడ్డుకున్నారు. రవీంద్ర తదితరులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో తోపులాటకు దారితీసింది. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నంలో తెదేపా నాయకురాలు త్రిపుర స్పృహ తప్పి పడిపోయారు. కోర్టు వద్ద రవీంద్రతోపాటు ముఖ్య నాయకులను అదుపులోకి తీసుకోవడంతో ర్యాలీ మధ్యలోనే నిలిచిపోయింది.

గూడూరు స్టేషన్‌ వద్ద హైడ్రామా: కొల్లు రవీంద్రను మొదట పెడన, బంటుమిల్లి వైపు తరలించి... గూడూరుకు తీసుకొచ్చారు. కొనకళ్ల జగన్నాథరావును పెడనకు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పెడన తెదేపా ఇన్‌ఛార్జి కాగిత కృష్ణప్రసాద్‌, తదితరులు గూడూరుకు చేరుకున్నారు. అక్కడ రాత్రి వరకు హైడ్రామా కొనసాగింది. చిలకలపూడి స్టేషన్‌లో రవీంద్రపై 188, 341, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు రాత్రి 7గంటల సమయంలో పెడనకు తీసుకువెళ్లారు. తర్వాత మచిలీపట్నం జిల్లా ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం రెండో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ వి.దేవిసాయిశ్రీవాణి ముందు హాజరుపరచారు. రవీంద్రను వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసిన న్యాయమూర్తి... వారం రోజుల వ్యవధిలో ఇద్దరు జామీనుదారులను హాజరుపర్చాలని ఆదేశించారు. విషయం తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు... పార్టీ న్యాయవిభాగం బాధ్యులను అప్రమత్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు