అదానీపై చర్చకు పట్టు.. స్తంభించిన పార్లమెంటు

అదానీ గ్రూపులో అవకతవకలు, ఆ కంపెనీ షేర్ల భారీ పతనంపై ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు తమ డిమాండును గట్టిగా వినిపించడంతో వరసగా మూడోరోజూ పార్లమెంటు స్తంభించిపోయింది.

Published : 07 Feb 2023 04:02 IST

దిల్లీ: అదానీ గ్రూపులో అవకతవకలు, ఆ కంపెనీ షేర్ల భారీ పతనంపై ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ (జేపీసీ) ద్వారా విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు తమ డిమాండును గట్టిగా వినిపించడంతో వరసగా మూడోరోజూ పార్లమెంటు స్తంభించిపోయింది. ప్రధాని నరేంద్రమోదీకి సన్నిహితుడైన అదానీ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి తమకు సమాధానాలు కావాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పెద్దఎత్తున గళమెత్తారు. వాయిదా తీర్మానాలకు నోటీసులు ఇచ్చారు. వీటిని ఉభయసభల్లో సభాపతులు తిరస్కరించారు. బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ వారంలోనైనా చర్చను మొదలుపెట్టవచ్చని ప్రభుత్వం ఆశించినా సోమవారం దానికి అవకాశమే లభించలేదు. ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడ్డాయి. అదానీ అంశంపై కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.  

అదానీకి సంబంధించి హిండెన్‌బర్గ్‌ సంస్థ నివేదిక సహా మొత్తం వ్యవహారంపై చర్చించాలని ఉభయసభల్లో ఎంపీలు గళమెత్తారు. వాయిదా తీర్మానాలు ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిపేందుకు విపక్షాలు సహకరించాలని సభాపతులు సూచించారు. ఎలాంటి చర్చ లేకుండానే లోక్‌సభ, రాజ్యసభ తొలుత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ, పరిస్థితుల్లో మార్పు రాలేదు. పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కూడా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీనిలో 17 పార్టీలు పాల్గొన్నాయి.  అదానీపై పార్లమెంటులో చర్చ జరగకుండా ప్రధాని మోదీ అన్ని ప్రయత్నాలూ చేస్తారని, దానికి కారణాలు విలేకరులకు తెలుసునని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. బిలియనీర్‌ వ్యాపారవేత్త వెనుక ఏ శక్తి ఉందనేది దేశానికి తెలియాలన్నారు.  


నేడు తొలగనున్న ప్రతిష్టంభన?

ప్రతిష్టంభనను తొలగించడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ వివిధ విపక్షాల ఫ్లోర్‌లీడర్లతో చర్చలు జరిపారు. దీని ఫలితంగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ మంగళవారం మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విపక్ష నేతలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని