Nara Lokesh: రాష్ట్రాన్ని వెనక్కి లాక్కెళుతున్న జగన్‌

గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్సార్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలుగుదేశం హయాంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆపలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు.

Updated : 07 Feb 2023 08:00 IST

‘యువగళం’లో ధ్వజమెత్తిన లోకేశ్‌

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్సార్‌, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి.. తెలుగుదేశం హయాంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆపలేదని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభించిన ఔటర్‌ రింగు రోడ్డు, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కంపెనీ పనులను వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆపకుండా ముందుకు తీసుకెళ్లారని ఆయన గుర్తు చేశారు. జగన్‌ మాత్రం అన్ని వర్గాలకు రావాల్సిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిలిపేశారని.. ఏ ముఖ్యమంత్రీ రాష్ట్రాన్ని ఇంత వెనక్కు తీసుకెళ్లలేదని మండిపడ్డారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా లోకేశ్‌ సోమవారం చిత్తూరులో బీడీ కార్మికులు, న్యాయవాదులు, మహిళలు, ఎస్సీలు, నిరుద్యోగ యువతతో మమేకమై వారి కష్టాలు తెలుసుకున్నారు. పాదయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. దీంతో నగరంలోని మహావీర్‌ వంతెన కిక్కిరిసింది.


వైకాపాను చిత్తుగా ఓడిస్తేనే ఉద్యోగాలు

‘పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో ఓ గ్రామానికి వెళ్లా. అక్కడ 1,700 మంది జనాభా ఉంటే ఏకంగా 1,500 మంది బతుకుదెరువు కోసం వలస వెళ్లారు. ఆ పల్లెలో మిగిలింది వృద్ధులు మాత్రమే. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తాము కూడా వలసపోతామని వారు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను చిత్తుచిత్తుగా ఓడిస్తేనే యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. తెదేపా అధికారంలోకి వస్తే అధిక పన్నులను తగ్గించి, నిత్యావసర వస్తువుల ధరలు నేలకు దించుతాం. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎందుకు మోసం చేశారని ‘గడప గడపకు’ కార్యక్రమానికి వచ్చే వైకాపా నాయకులను ప్రజలు నిలదీయాలి. ఆసరా పథకం డబ్బులు రాలేదని పలమనేరులో రాణెమ్మ అనే మహిళ మాట్లాడితే ఆమె ఇంటికి పోలీసులను పంపి బెదిరిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్‌ ఒకరు తన సెల్‌ఫోన్‌ కవర్‌పై చంద్రబాబు ఫొటో పెట్టుకోవడంతో పాటు కరచాలనం చేశారని ఆయన్ను సస్పెండ్‌ చేశారంటే ఈ ప్రభుత్వ వైఖరి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పక్కా ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, అధికారంలోకి రాగానే న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.


ఉద్యోగులను ప్రభుత్వం వేధిస్తోంది

విద్యుత్తు శాఖ ఒప్పంద ఉద్యోగులు లోకేశ్‌ను కలిశారు. తమకు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియడం లేదని, డీఏలూ ఇవ్వడం లేదని వాపోయారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని జగన్‌ నెరవేర్చలేదని అనిత అనే ఉద్యోగిని తెలిపారు. సీపీఎస్‌ను వారంలో రద్దు చేస్తానని చెప్పి.. ఇప్పుడు అవగాహన లేక హామీ ఇచ్చానని ముఖ్యమంత్రి చెబుతున్నారని విమల అనే ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను ఇంతగా వేధిస్తున్న జగన్‌కు ఓటమి ఖాయమని లోకేశ్‌ అన్నారు. దళితుడైన నారాయణస్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా.. జగన్‌, పెద్దిరెడ్డి ఉన్నచోట ఆయన కూర్చునేందుకు కుర్చీ కూడా ఇవ్వరని విమర్శించారు. అంతకు ముందు నిరుద్యోగ యువకులు లోకేశ్‌ను కలిసి కానిస్టేబుల్‌ ప్రాథమిక పరీక్ష కటాఫ్‌ మార్కులు తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. దళితుడినయిన తనపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుతోపాటు 11 అక్రమ కేసులు పెట్టించారని, రౌడీషీట్‌ తెరిపించారని సుబ్బరాజు అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని