రాష్ట్రంలో భాజపా గెలుపు తథ్యం

తెలంగాణలో తమకు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమవుతున్నా భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ధీమా ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం పూర్తి సమయం వెచ్చించాలని ఆయన కోరారు.

Published : 08 Feb 2023 05:50 IST

భారాసకు తెలంగాణతో బంధం తెగిపోయింది
10వ తేదీ నుంచి 11 వేల ‘కూడలి సమావేశాలు’
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో తమకు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ ఏకమవుతున్నా భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ధీమా ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులు పార్టీ కోసం పూర్తి సమయం వెచ్చించాలని ఆయన కోరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మన్నెగూడలో మంగళవారం నిర్వహించిన ‘11వేల శక్తి కేంద్రాల సభల్లో పాల్గొనే వక్తల కార్యశాల’లో బండి సంజయ్‌ మాట్లాడారు. కార్యక్రమంలో భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, మాజీ మంత్రులు బాబుమోహన్‌, విజయరామారావు, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్‌, రవీంద్రనాయక్‌, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌ కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

‘ప్రజా గోస- బీజేపీ భరోసా’..

ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ ‘ప్రజా గోస- బీజేపీ భరోసా’ నినాదంతో 11 వేల కూడలి సమావేశా(స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగు)ల ద్వారా తెరాస ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్‌ కుటుంబ పాలన సహా భాజపా అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలో భాజపా ఈనెల 10 నుంచి 25 వరకు శక్తి కేంద్రాల పరిధిలో కూడలి సమావేశాలు నిర్వహించబోతోందన్నారు. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారీసభలు జరుపుతామన్నారు. తెలంగాణతో భారాసకు బంధం తెగిపోయిందని బండి సంజయ్‌ అన్నారు. నాందేడ్‌ సభలో సీఎం చెప్పిన అంశాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. కృష్ణా జలాలను ఆంధ్రకు అప్పగించారని, ఎస్సారెస్పీ నుంచి నీళ్లు ఎత్తిపోసుకోవాలని గోదావరిని మహారాష్ట్రకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు