మోదీ పాలనలో అవినీతి లేని భారత్‌

దేశంలో అక్కడ అయోధ్య ఆలయం నిర్మితమవుతుంటే.. ఇక్కడ (దిల్లీలో) పార్లమెంటు భవన నిర్మాణం జరుగుతోందని భాజపా రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు.

Published : 08 Feb 2023 05:50 IST

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల చర్చను ప్రారంభించిన ఎంపీ లక్ష్మణ్‌

ఈనాడు, దిల్లీ: దేశంలో అక్కడ అయోధ్య ఆలయం నిర్మితమవుతుంటే.. ఇక్కడ (దిల్లీలో) పార్లమెంటు భవన నిర్మాణం జరుగుతోందని భాజపా రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చను రాజ్యసభలో మంగళవారం ఆయన ప్రారంభించారు. 52 నిమిషాల పాటు ప్రసంగించారు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌’ అన్న మహాకవి గురజాడ అప్పారావు పలుకులతో ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో కుంభకోణాలు, అవినీతి లేని దేశం సాకారమైందన్నారు. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించిందని అన్నారు. ‘‘స్వాతంత్య్ర అమృతకాలంలో.. ఓ దళిత రాష్ట్రపతి, ఓ మహిళా ఆర్థికశాఖ మంత్రి ఉన్న సమయంలో పార్లమెంటులో ప్రసంగించడం గర్వకారణంగా ఉంది’’ అని పేర్కొన్నారు. నూతన విద్యావిధానంలో భాగంగా దేశంలో మాతృభాషలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. రానున్న తరాల కోసం చరిత్రను పునర్దర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర పథకాల గురించి వివరించారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2009-14 మధ్యకాలంలో రాష్ట్రాలకు సగటున ఏడాదికి జరిగిన రైల్వే కేటాయింపులతో పోలుస్తూ.. 2014 నుంచి ఇంతవరకు తెలంగాణకు అంతకు 5రెట్లు నిధులు దక్కాయని లక్ష్మణ్‌ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రైల్వేలపరంగా రూ.29,581 కోట్ల ప్రాజెక్టులున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తే ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్టులకు భూసేకరణ, అనుమతులు, రాష్ట్ర వాటాల విషయంలో కేంద్రం తరచూ గుర్తుచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లేదని విమర్శించారు. కాజీపేటకు రూ.260 కోట్ల విలువైన కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వాలనే డిమాండ్‌ ఉందని.. అయితే అందుకు అవసరమైన 1.5 ఎకరాల భూమిని ఇవ్వలేకపోయిందన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం కోచ్‌ ఫ్యాక్టరీని మించిన రూ.544 కోట్ల విలువైన వ్యాగన్‌ ఫ్యాక్టరీని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని