మన కృషిని ప్రజలు గుర్తిస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఎన్నికల బడ్జెట్‌ అని ఆరోపించే ధైర్యం ఎవ్వరికీ లేదని ప్రధాని మోదీ అన్నారు.

Published : 08 Feb 2023 04:09 IST

భాజపా ఎంపీలకు ప్రధాని మోదీ సూచన

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఎన్నికల బడ్జెట్‌ అని ఆరోపించే ధైర్యం ఎవ్వరికీ లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధితో పాటు సమాజంలోని ప్రతి వర్గానికీ ఉపయుక్తంగా ఉండేలా రూపొందించామని తెలిపారు. తమ ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లోనూ పేదలు, వెనకబడిన వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. దిల్లీలో మంగళవారం నిర్వహించిన భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించిన మోదీ.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ప్రజల వద్దకు వెళ్లి బడ్జెట్‌లోని ప్రయోజనాలను, మన కృషిని వివరించాలని, వారు గుర్తిస్తే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉండదన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ అయినప్పటికీ.. ‘ఎన్నికల బడ్జెట్‌’ అని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదన్నారు. సైద్ధాంతికంగా భాజపాను వ్యతిరేకించే వారు కూడా బడ్జెట్‌ను స్వాగతించారని ప్రధాని మోదీ చెప్పినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి విలేకరులకు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీలు క్రీడా సమావేశాలు నిర్వహించాలని ప్రధాని మోదీ సూచించారన్నారు. క్రీడల్లో యువత ఎక్కువగా భాగస్వామ్యం కావడం లేదనే భావనతో ఈ విధంగా చెప్పారని తెలిపారు. జీ-20 సమావేశాల కోసం వస్తున్న విదేశీ అతిథులు.. ఇక్కడి ఏర్పాట్లను ప్రశంసిస్తున్నారని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని