అదానీ అంశంపై జేపీసీ వేయడానికి సిగ్గెందుకు?

అదానీ వివాదంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

Published : 08 Feb 2023 04:09 IST

రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసిన ప్రతిపక్షం

దిల్లీ: అదానీ వివాదంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని మంగళవారం రాజ్యసభలో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. గౌతమ్‌ అదానీకి చెందిన సంస్థపై హిండెన్‌బర్గ్‌ పరిశోధక సంస్థ చేసిన ఆరోపణలపై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటు చేసి సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఎందుకు అంగీకరించడంలేదని నిలదీశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష సభ్యలు చర్చలో పాల్గొన్నారు. అదానీ అంశంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని లేదంటే అదే మిమ్మల్ని అధికారం నుంచి దించుతుందని హెచ్చరించారు. భాజపా అమృత్‌కాల్‌ సమయంలో ధనవంతులే ప్రయోజనాలు పొందుతున్నారని ఆరోపించారు. రెండుసార్లు వాయిదా పడిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభ తిరిగి సమావేశమైంది. ‘ధన్యవాద తీర్మానం’పై చర్చను చేపట్టింది. అయితే అదానీ అంశంపైనే తొలుత చర్చ చేపట్టాలని, ఇప్పటి వరకూ కేంద్రం జేపీసీ ఏర్పాటుకు అంగీకరించకపోవడాన్ని నిరసిస్తూ ఆప్‌, భారస, శివసేన(ఠాక్రే వర్గం) సభ్యులు సభ నుంచి బాయ్‌కాట్‌ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్‌డీయే ప్రభుత్వం మహిళాభివృద్ధికి కృషి చేస్తోందని..చర్చను ప్రారంభించిన భాజపా సభ్యుడు కె.లక్ష్మణ్‌ శ్లాఘించారు. జాతీయ విద్యా విధానం, ఆయుష్మాన్‌ భారత్‌, రాజ్యసభకు ఎక్కువ మంది మహిళలను నామినేట్‌ చేయడం, వందేభారత్‌ రైలు సర్వీసులు తీసుకువచ్చిందని ప్రశంసలు కురిపించారు. 

దేశాన్ని మోసగించిన అదానీ: మహువా మొయిత్రా

అదానీ-హిండెన్‌బర్గ్‌ నివేదిక అంశం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. కోటీశ్వరుడైన పారిశ్రామికవేత్త దేశాన్ని మోసం చేశారని ఆరోపించారు. లోక్‌సభలో మంగళవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అదానీ పేరును ప్రస్తావించకుండా.. ‘ఏ’ ప్రారంభమై ‘ఐ’తో అంతమయ్యే పేరు కలిగిన ప్రముఖ వ్యక్తి (అద్వానీ కాదు) అందరినీ మోసగించాడని పేర్కొన్నారు. అదానీ సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆమె ప్రసంగంపై భాజపా సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొయిత్రా క్షమాపణ చెప్పాలని పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని