పింఛను లేదు.. పథకాలు అందట్లేదు

‘ఒంటరి మహిళకు పింఛను ఆపేశారు. జగనన్న గృహాల బిల్లులు రావట్లేదు. అర్హత ఉన్నా పథకాలు అందడం లేదు. ఇంటికి దారి లేకుండా చేశారు.

Published : 08 Feb 2023 04:17 IST

విప్‌ ధర్మశ్రీని నిలదీసిన మహిళలు

రావికమతం, న్యూస్‌టుడే: ‘ఒంటరి మహిళకు పింఛను ఆపేశారు. జగనన్న గృహాల బిల్లులు రావట్లేదు. అర్హత ఉన్నా పథకాలు అందడం లేదు. ఇంటికి దారి లేకుండా చేశారు.. ఇలా పలు సమస్యలను దళిత మహిళలు ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ వద్ద ఏకరవు పెట్టారు. ‘గడప గడపకు’ కార్యక్రమంలో భాగంగా ధర్మశ్రీ మంగళవారం అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటలోని అంబేడ్కర్‌, అరుంధతీ కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలు వైకాపా ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరుగుతోందని, స్థానిక వైకాపా నాయకులు అర్హత ఉన్నా కూడా సంక్షేమ పథకాలు అందకుండా ఆపేస్తున్నారని, ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. ఒంటరి మహిళ పింఛను నిలిపివేశారని తంగేటి చిన్నమ్మలు, జగనన్న కాలనీ ఇల్లు కట్టినా బిల్లులు రావట్లేదని కుమారి, ఇంటికి తోవలేకుండా చేస్తున్నారని రాము అనే మహిళ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలనీల్లోని తాగునీటి సరఫరా, రోడ్లు, కాలువల సమస్యలపై కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు రావడంలేదని ఎవరూ బాధపడొద్దని, అర్హులందరికీ అందించేలా చూస్తామని ధర్మశ్రీ మహిళలకు సర్దిచెప్పారు. అనంతరం అంబేడ్కర్‌ కాలనీలో సామాజిక భవన నిర్మాణానికి రూ.10 లక్షలు, అరుంధతీ కాలనీలో జగ్జీవన్‌రాం విగ్రహం వద్ద సామాజిక భవన నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని