వైకాపా పాలనలో ఏపీ ఓ విఫల రాష్ట్రం

వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోయిందని, ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, కేంద్రం జోక్యం చేసుకొని చక్కదిద్దాలని తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు డిమాండ్‌ చేశారు.

Published : 08 Feb 2023 04:17 IST

మూడున్నరేళ్లుగా ప్రజాస్వామ్యం పతనం
తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలి
తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు

ఈనాడు, దిల్లీ: వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ఒక విఫల రాష్ట్రంగా మిగిలిపోయిందని, ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, కేంద్రం జోక్యం చేసుకొని చక్కదిద్దాలని తెదేపా ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు డిమాండ్‌ చేశారు. మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లవుతోంది. నాటి హామీల్లో చాలావరకూ అసంపూర్తిగానే మిగిలాయి. ఫలితంగా మేం తొలిరోజు అడిగిందే ఇప్పుడూ అడగాల్సి వస్తోంది. వాటిలో ప్రధానమైంది ప్రత్యేక హోదా. పదేళ్లు ఇస్తామన్న హోదా ఊసే లేదు. కేంద్ర విద్యా సంస్థలకు తెదేపా ప్రభుత్వం పూర్తిగా భూములిచ్చినా కేంద్రం తగినన్ని నిధులు ఇవ్వకపోవడంతో ఇప్పటివరకు వాటికి శాశ్వత భవనాల నిర్మాణం పూర్తికాలేదు. మా ప్రభుత్వ హయాంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.1,050 కోట్లు సాధించుకోగలిగాం. ప్రస్తుత ప్రభుత్వం పైసా తెచ్చుకోలేదు. మా ప్రభుత్వ ఒత్తిడితోనే కేంద్రం గతంలో విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ప్రకటించింది. అదింకా ప్రారంభమే కాలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం నిర్మాణం తెదేపా హయాంలోనే 70% పూర్తయింది. వైకాపా అధికారంలోకి వచ్చాక పనులు పూర్తిగా స్తంభించాయి.

ప్రతిపక్షాల అణచివేతకు కుట్ర: ప్రతిపక్షాలను అణచి వేసేందుకు వైకాపా ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా జీవో1 తెచ్చింది. మూడేళ్ల కిందట జీవో2430 తీసుకొచ్చి మీడియాపై కేసులు పెట్టడం ప్రారంభించారు. వైకాపా ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగులనూ వేధిస్తోంది. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసేవరకు పరిస్థితులు వెళ్లాయి. 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్‌ను ప్రభుత్వం వాడుకునే దుస్థితికి దిగజారింది’ అని రామ్మోహన్‌నాయుడు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని