మూడు రాజధానులకు రూ.300 కోట్లు కూడా ఇవ్వని ఆ పార్టీతో పొత్తు పెట్టుకోం

మూడు రాజధానులు నిర్మించేందుకు రూ.300 కోట్లు కూడా మంజూరు చేయని పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Published : 08 Feb 2023 04:17 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: మూడు రాజధానులు నిర్మించేందుకు రూ.300 కోట్లు కూడా మంజూరు చేయని పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, పత్తికొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుతో తాము అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు. వారాహి వాహన పూజ సమయంలో తాము భాజపాతో ఉన్నట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారని గుర్తు చేశారు. ‘ప్రత్యేక హోదా అంశం పార్లమెంటులో చర్చకు వచ్చింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించింది. రాష్ట్రంలో రెండు కుటుంబ పార్టీల అండతో ప్రజా ప్రతినిధులు వనరుల దోపిడీకి పాల్పడ్డారు...’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వంద ఎకరాల భూమిని ఆక్రమించారని, జిల్లా మంత్రి ఏకంగా పరిశ్రమలకు ఇచ్చిన భూమిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ‘మార్చి 10 నుంచి 30వ తేదీ వరకు జనపోరు పేరుతో పాదయాత్ర చేస్తాం. లక్ష మంది ప్రజలతో మాట్లాడి సమస్యలపై ఛార్జిషీట్‌ వేస్తాం. అప్పర్‌ భద్ర ప్రాజెక్టు నుంచి రాయలసీమకు అన్యాయం జరగకుండా కేటాయింపులు వచ్చేలా చూస్తాం...’ అని సోము వీర్రాజు పేర్కొన్నారు. రాయలసీమ ప్రాజెక్టులు, అభివృద్ధిపై మాట్లాడే దమ్ము, ధైర్యం ఇక్కడి రాజకీయ నాయకులకు లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోయిందని చెప్పారు. తొలుత ఎమ్మిగనూరు పట్టణం గాంధీనగర్‌లో భాజపా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్రకు ఓటు వేయాలని ఇంటింటా కరపత్రం అందజేసి సోము వీర్రాజు అభ్యర్థించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు