బోరుగడ్డ అనిల్‌ కార్యాలయానికి నిప్పు

గుంటూరులోని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎ) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్‌ కార్యాలయాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు.

Published : 08 Feb 2023 04:17 IST

గుంటూరు (పట్టాభిపురం, నగరంపాలెం), న్యూస్‌టుడే: గుంటూరులోని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా(ఎ) రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్‌ కార్యాలయాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దహనం చేశారు. పోలీసులు, అగ్నిమాపక శకటం అరండల్‌పేటలోని సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. వాచ్‌మన్‌ నారాయణతో కలిసి అనిల్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ముసుగు ధరించిన ఆరుగురు వ్యక్తులు పెట్రోల్‌ పోసి, తగులబెట్టారని వాచ్‌మన్‌ ఫిర్యాదు చేసినట్లు సీఐ రామానాయక్‌ తెలిపారు. సీసీ పుటేజ్‌ ఇవ్వాలని పోలీసులు కోరగా, అది పని చేయడం లేదని చెబుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు మంగళవారం విలేకరులతో బోరుగడ్డ అనిల్‌ మాట్లాడుతూ... ‘నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై నేను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే శ్రీధర్‌రెడ్డి అనుచరులు, గుంటూరుకు చెందిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, అతని అనుచరులు నా కార్యాలయాన్ని దహనం చేశారు. అడ్డొచ్చిన మా వాచ్‌మన్‌పై పెట్రోల్‌ పోసి చంపేందుకు యత్నించగా అతను పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. శ్రీధర్‌రెడ్డి, అతని సోదరుడు గిరిధర్‌రెడ్డి నన్ను అంతమొందించేందుకు కుట్ర చేశారు. వారి అనుచరుడు బాబురెడ్డి ఫోన్‌ చేసి అసభ్య పదజాలంతో దూషించారు’ అని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని