Nara Lokesh: జగన్‌కు.. భయమంటే ఏంటో పరిచయం చేస్తా

‘మోసానికి మారుపేరు జగన్‌.. ఒక్క అవకాశం నినాదంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కేసులకు భయపడి ప్రత్యేక హోదాను దిల్లీలో తాకట్టు పెట్టారు.

Updated : 08 Feb 2023 07:02 IST

‘యువగళం’ సభలో లోకేశ్‌ హెచ్చరిక

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: ‘మోసానికి మారుపేరు జగన్‌.. ఒక్క అవకాశం నినాదంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. కేసులకు భయపడి ప్రత్యేక హోదాను దిల్లీలో తాకట్టు పెట్టారు. ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేస్తానని మాటిచ్చి మోసం చేశారు. ఏటా 6,500 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇస్తానని యువతను వంచించారు. వాటిపై ప్రశ్నించేందుకు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, యువతకు భరోసా ఇచ్చేందుకే యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్నా’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. బంగారుపాళ్యంలో నలుగురు తెదేపా కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేసినా న్యాయస్థానం వారికి బెయిలు ఇచ్చిందన్నారు. తమ కార్యకర్తల జోలికి వచ్చే ఎవరినైనా వదిలిపెట్టబోమని.. 2024లో జగన్‌ తన ఇంటినుంచి బయటకు ఎలా అడుగు పెడతారో చూస్తానన్నారు. ఆయనకు భయమంటే ఏంటో పరిచయం చేస్తానని హెచ్చరించారు. యువగళం 12వ రోజైన మంగళవారం లోకేశ్‌ చిత్తూరులో సాయంత్రం బహిరంగసభ నిర్వహించి, అనంతరం పాదయాత్ర చేశారు.

కల్తీ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు

‘జగన్‌ ఊరూరా తిరుగుతూ పదేపదే వై నాట్‌ 175 అని నినాదం చేస్తున్నారు.. ఇప్పుడు వై నాట్‌ ప్రత్యేక హోదా, వై నాట్‌ పోలవరం, వై నాట్‌ కడప ఉక్కు పరిశ్రమ అని నేను అడుగుతున్నా. కల్తీ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారు. త్వరలో పీల్చే గాలిపైనా పన్ను వేస్తారేమో? ఆయన సీఎం అయ్యాక రాయలసీమకు అడుగడుగునా ద్రోహం చేస్తున్నారు. ఒక్క సాగు, తాగునీటి పథకాన్నీ పూర్తిచేయలేదు. రాయలసీమ వరప్రదాయిని హంద్రీ- నీవాను ఆపేశారు. ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్‌, గంజాయి, అప్పుల్లో నంబర్‌ 1గా చేశారు. 50వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలుగుదేశం ప్రభుత్వం రిలయన్స్‌ను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తీసుకొస్తే కమీషన్ల కోసం జగన్‌ ఆ పరిశ్రమను తరిమేశారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నియోజకవర్గంలో 300 ఎకరాలు కబ్జా చేశారు. సీఎం సహాయనిధిలోనూ ఎమ్మెల్యే 10- 20 శాతం కమీషన్‌ కొట్టేస్తున్నారు’ అని లోకేశ్‌ ఆరోపించారు. పాదయాత్రగా వెళ్తున్నప్పుడు.. సచివాలయంగా మార్చిన అన్నక్యాంటీన్‌ను పరిశీలించారు. ఇక్కడి ఉద్యోగులతో మాట్లాడితే వీరి కొలువులు జగన్‌ తీసేస్తారని మధ్యలోనే సంభాషణను ముగించి ముందుకు వెళ్లారు. కార్యక్రమంలో మాజీమంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు దొరబాబు, దువ్వారపు రామారావు, దీపక్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంటు తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని, పీలేరు, పుంగనూరు, గంగాధరనెల్లూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కిశోర్‌కుమార్‌రెడ్డి, చల్లా బాబు, చిట్టిబాబు, యువగళం మీడియా సమన్వయకర్త బీవీ వెంకటరాముడు, శ్రీధర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని