Botsa: వైకాపాలో వర్గపోరు.. బావాబామ్మర్దులు X బొత్స కుటుంబం

నెల్లిమర్లలో మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు కుటుంబం మధ్య స్పర్థలు చోటుచేసుకోవడంతో నియోజకవర్గంపై ఎవరికి వారు పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు.

Updated : 08 Feb 2023 11:22 IST

ఉమ్మడి విజయనగరం జిల్లానెల్లిమర్ల వైకాపాలో వర్గపోరు ఎక్కువగా ఉంది. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం, స్థానిక ఎమ్మెల్యే బడుకొండ అప్పల నాయుడు కుటుంబం మధ్య స్పర్థలు చోటుచేసుకోవడంతో నియోజకవర్గంపై ఎవరికి వారు పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. బొత్స మేనల్లుడు, విజయనగరం జడ్పీ ఛైర్మన్‌ చిన్న శ్రీను.. ఎమ్మెల్యే అప్పల నాయుడు బావాబామ్మర్దులు. త్వరలో వియ్యంకులు కాబోతున్న ఈ నేతలిద్దరూ ఇప్పుడు ఒకటిగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి పోటీ చేసేందుకు మంత్రి బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లక్ష్మణరావు, ఆయన తనయుడు నియోజకవర్గంలో పట్టు సాధించే పనిలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అప్పల నాయుడు నిలిపిన సర్పంచి అభ్యర్థులకు వ్యతిరేకంగా 5 చోట్ల లక్ష్మణరావు తన మద్దతుదారులను బరిలో దింపి 3 చోట్ల గెలిపించుకున్నారు. నెల్లిమర్లలో స్థానిక పార్టీ నాయకులు పలువురు మంత్రి బొత్సకు సహచరులు, అనుయాయులున్నారు. దీంతో ఎమ్మెల్యే అక్కడ కార్యక్రమాలను తగ్గించుకుని, నియోజకవర్గంలోని ఇతర మండలాలపై దృష్టి పెట్టారు. ‘మీ తమ్ముడు నా నియోజకవర్గంలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. మీరు నియంత్రించకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తా’ అంటూ మండల పరిషత్‌ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బహిరంగంగానే మంత్రి బొత్సను హెచ్చరించారు.

ఇటీవల అప్పల నాయుడి కుమారుడి వివాహానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్‌ను బొత్స కుటుంబ సభ్యులు హెలిపాడ్‌వద్దే కలిసి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. బొత్స మద్దతిచ్చే ఎమ్మెల్సీ పెన్మత్స సూర్యనారాయణ రాజు (సురేష్‌) పదవీ కాలం మార్చిలో ముగియనుంది. ఆయనకు ఆ పదవిని రెన్యువల్‌ చేయకుండా 2009లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన కందుల రఘుబాబుకు ఇస్తే పార్టీ బలోపేతమవుతుందని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్‌ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ఎవరికివారు నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని