తెలంగాణ అభివృద్ధికి నిధులివ్వని కేంద్రం

పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వటం లేదని.. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న నిధుల్లో మూడింట ఒక వంతే తెలంగాణకు ఇస్తోందని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

Updated : 09 Feb 2023 05:46 IST

రాష్ట్రంలో ఆదాయానికి, ఖర్చుకు మధ్య పొంతనలేదు
ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ

ఈనాడు, హైదరాబాద్‌: పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వటం లేదని.. ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్న నిధుల్లో మూడింట ఒక వంతే తెలంగాణకు ఇస్తోందని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. బడ్జెట్‌పై చర్చలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పడిన తరవాత ఇది తొమ్మిదో బడ్జెట్‌. ప్రతి పద్దులోనూ మిగులు నిధులు చూపుతారు. చివరికి లోటు ఉంటోంది. ఇప్పటివరకు మిగులన్నది లేదు. ఆదాయానికి, ఖర్చులకు మధ్య పొంతన లేదు. కేంద్రం నుంచి పన్నులు, గ్రాంట్ల రూపంలో భారీగా వస్తున్నాయని చూపుతున్నారు. పూర్తిస్థాయిలో రావటం లేదు. అయితే కేంద్ర సగటు జీడీపీ కన్నా తెలంగాణ జీఎస్‌డీపీ ఎక్కువగా ఉంది. మైనార్టీ సంక్షేమానికి నిధులు కేటాయిస్తున్నప్పటికీ పెండింగ్‌ బకాయిలను విడుదల చేయాలి. గతంలో ఇచ్చిన ప్రీ మెట్రిక్‌ ఉపకార వేతనాలను కేంద్రం నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాన్ని చేపడితే పేద విద్యార్థులకు మేలు కలుగుతుంది. వక్ఫ్‌ బోర్డు రికార్డులను ఆడిట్‌ చేయించి, రికార్డులను కంప్యూటరీకరించండి.

పాత నగరంలో ‘మెట్రో’ పనులు చేపట్టండి

మా డిమాండ్‌ మేరకు పాత నగరం అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలతో మంగళవారం సమావేశం నిర్వహించినందుకు కృతజ్ఞతలు. అధిక శాతం అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తే కొత్త నగరంతో పాత నగరం పోటీ పడుతుందన్న ఆశాభావంతో ఉన్నాం. పాత నగరంలో మెట్రో రైలు పనులు చేపట్టాలి. నోటరీపై ఉండే ఆస్తులను రిజిస్ట్రేషన్‌ పత్రాలుగా త్వరితగతిన ప్రకటించాలి. లాల్‌దర్వాజా పనులు త్వరితగతిన పూర్తి చేస్తే  హిందువులకు ఉపయుక్తంగా ఉంటుంది. హిందువుల కోసం మా ద్వారాలు ఎప్పుడూ తెరుచుకుని ఉంటాయి’’ అని అక్బరుద్దీన్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని